● రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క
ములుగు: అమ్మ మాట – అంగన్‌వాడీ బాటతోనే ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించడం సాధ్యమని, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐ లవ్ ములుగు థీమ్ వద్ద పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి సీతక్క హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఐసీడీఎస్ విభాగం ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తినే ఆహారంలో పోషక విలువలు తగ్గడం, కల్తీ ఆహారం, జంక్ ఫుడ్ తినడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. అందుకోసమే బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలకు విషంతో సమానమని, తల్లులు తమ చేతులతో వండిన నాణ్యమైన ఆహారాన్నే పిల్లలకు అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు రోడ్ల మీద దొరికే ఆహారం తీసుకోవద్దన్నారు. కల్తీ లేని పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే తల్లితో పాటు బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అమ్మ మాట – అంగన్‌వాడీ బాట అనే నినాదంతో ప్రతీ అంగన్‌వాడీ సెంటర్ ద్వారా నాణ్యమైన ఆహారం అందించడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ డిపార్ట్‌మెంట్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, పాత బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను సీతక్క ప్రారంభించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, డిడబ్ల్యూఓ ప్రేమలత పాల్గొన్నారు.


