పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
ములుగు: నిరుపేదలకు సన్నబియ్యం అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. దొడ్డుబియ్యంపై లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదనే కారణంతో ఏడాది క్రితం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. మొదటి మూడు, నాలుగు నెలల పాటు సన్నబియ్యంపై ఆసక్తి చూపిన లబ్ధిదారులు ప్రస్తుతం అంతగా పట్టించుకోవడంలేదని తెలుస్తుంది. దీంతో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం నాణ్యత లోపంతో ఉంటున్నాయని, అన్నం వండితే మెత్తగా అవ్వడమే కాకుండా బియ్యానికి తొందరగా పురుగులు పడుతున్నాయని లబ్ధిదారుల అభిప్రాయం. సన్నబియ్యంపై ఆసక్తి చూపని లబ్ధిదారులు రేషన్ షాపుల్లో వేలిముద్రలు వేస్తే డీలర్లు కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తుండడంతో నగదును తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఒకరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో నలుగురు ఉంటే 24 కిలోల బియ్యాన్ని రూ.288 చొప్పున డీలర్లకే విక్రయిస్తున్నారు.
క్వింటా రూ.2800
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 222 రేషన్ షాపులు ఉండగా 1.02 లక్షల కార్డుదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో 5,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు అందించనున్నారు. గత 10 రోజులుగా రేషన్ షాపుల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుండగా మెజార్టీ రేషన్ షాపుల్లో బియ్యం దందా కొనసాగుతుంది. లబ్ధిదారులతో మూడుసార్లు వేలిముద్ర వేసుకొని కిలోకు రూ.12 చొప్పున చెల్లిస్తూ బియ్యాన్ని డీలర్లు తమ వద్దనే నిల్వ చేసుకుంటున్నారు. సన్నబియ్యం మార్కెట్‌లో రూ.5 వేల నుంచి రూ.6 వేల ధర ఉండగా రేషన్ షాపుల్లో క్వింటాకు రూ.2,800 చొప్పున బహిరంగంగానే విక్రయిస్తున్నారు. ఒక్కొక్క బస్తా 50 కిలోలు ఉండగా బస్తాకు రూ.2,400 చొప్పున విక్రయిస్తూ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. లబ్ధిదా రులకు రూ.12 చొప్పున చెల్లించి అదే బియ్యాన్ని రూ.28 కు విక్రయిస్తుండడం గమనార్హం.
జిల్లాలోని రేషన్ షాపులపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మూడు నెలల కోటా ఒకేసారి ఇస్తుండడంతో ఏప్రిల్ 30 వరకు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లా పౌర సరఫరాల అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ ఏడాదిలో రేషన్ షాపులపై పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఒక్కొక్క రేషన్ షాపు నుంచి ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేసి అధికారులకు ముడుపులు అప్పజెప్పుతున్నట్లు డీలర్లు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సన్నబియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకొని బ్లాక్ మార్కెట్‌లో సన్నబియ్యాన్ని విక్రయిస్తున్న డీలర్లపై కఠన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
సన్న బియ్యం అమ్ముకుంటున్న
రేషన్ డీలర్లు
క్వింటా రూ.2,800 చొప్పున విక్రయం
మెజార్టీ రేషన్ షాపుల్లో కొనసాగుతున్న అక్రమ దందా
రేషన్ షాపులపై కరువైన అధికారుల పర్యవేక్షణ


