సింగరేణి సెక్యూరిటీ గార్డు నియామకాల్లో అన్యాయం
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు పరీక్షలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ అధికారులు (ఫైల్)
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యం ప్రవేశపెడుతున్న నూతన టెండర్ విధానం సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్హుల ఉపాధిని దెబ్బతీసేలా ఉంది. సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో దాదాపు 20 ఏళ్లుగా సుమారు 1,200 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ గార్డులు పనిచేస్తూ సంస్థ ఆస్తుల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. యాజమాన్యం వీరి ఉపాధిని దెబ్బతీసేలా నూతన టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టెండర్ విధానాన్ని రద్దుచేయాలని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కోరుతున్నారు. సింగరేణిలో అవుట్ సోర్సింగ్ ప్రారంభమైన తొలిరోజుల్లో 2001 నుంచి నేటివరకు సింగరేణి వ్యాప్తంగా సుమారు 1,220 మంది కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డులను కంపెనీ నియమించింది. వీరిలో ఆ ప్రాంతంలో ఉన్న భూ నిర్వాసితులు, వివిధ గ్రామాల ఓసీ ప్రభావిత ప్రాంతాల గ్రామాల నిరుద్యోగ యువకులు, సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాజీ కార్మికుల వారసులు ఉన్నారు. వీరంతా సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలలో చాలీచాలని జీతాలతో, చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అందనప్పటికీ సంస్థ అభివృద్ధి కోసం విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు ఉన్న భూములను కంపెనీకి ఇచ్చి, కట్టుకున్న ఇళ్లు కోల్పోయి పూర్తి నిర్వాసితులుగా మారారు. వీరు సింగరేణి ఇచ్చిన ప్రైవేట్ ఉద్యోగంతో తమ బతుకు బండిని నడుపుతున్న క్రమంలో కంపెనీలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల స్థానంలో కొత్తగా పలు నిబంధనలు తెచ్చింది. భూనిర్వాసితులుగా సింగరేణి చే గుర్తించబడిన వారికి ఈ నూతన విధానం వలన ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసే విధంగా టెండర్ విధానాన్ని యాజమాన్యం తెచ్చిందని తక్షణమే ఈ నూతన టెండర్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్నే కొనసాగించే విధంగా సవరణ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు.
పర్మనెంట్, కీ పోస్టుల్లో సైతం విధులు..
సింగరేణి సంస్థలో గతంలో రిటైర్డ్ ఆర్మీ అభ్యర్థులను సెక్యూరిటీ గార్డులుగా యాజమాన్యం నియామకాలు చేపట్టేది. ఆ పక్రియను నిలిపివేస్తూ అండర్ గ్రౌండ్లలో పనిచేసిన ఉద్యోగులతో సెక్యూరిటీ గార్డుల నియామకాలు చేపట్టింది. ఆ తర్వాత దానిని కొనసాగించకుండా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల నియామకం చేపట్టింది. ఈ క్రమంలో పర్మనెంట్ సెక్యూరిటీ గార్డుల కంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సంఖ్య గణనీయమంగా పెరిగింది. గతంలో పర్మనెంట్ కార్మికులు చేసిన పోస్టుల్లో ప్రైవేట్ వారు విధులు నిర్వహిస్తూ కంపెనీ ఆస్తులను కాపాడుతున్నారు. ఈ నియామకాల్లో ప్రభావిత ప్రాంతాల వాసులు, ఇళ్లు, స్థలాలు కోల్పోయిన వారికి కల్పించిన అవకాశాన్ని రద్దుచేసి, వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా యాజమాన్యం తెచ్చిన నూతన విధానాన్ని రద్దు చేయాలని వేడుకుంటున్నారు.
యాజమాన్యం ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి ని తొలగించే ప్రక్రియలో భాగంగా తీసుకొచ్చి న కొత్త సర్క్యులరు వెంటనే రద్దుచేసి పాత వారికి చట్టబద్ధత హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేదంటే ఆందోళన చేపడతాం. సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం పంటపొలాలు, ఇళ్లను ధారాదత్తం చేసిన భూనిర్వాసితులకు యాజమాన్యం తెచ్చిన నూతన విధానంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది.
– కంపేటి రాజయ్య,
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఉపాధిని దెబ్బతీసేలా
నూతన టెండర్ విధానం
నిబంధనలు మార్చాలని డిమాండ్


