నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షుడి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షుడి రాక

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

ములుగు: టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ కుమార్‌ నేడు(శనివారం) జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారని తెలిపారు. గట్టమ్మ నుంచి లీలా గార్డెన్‌ వరకు బైక్‌ ర్యాలీ ఉంటుందని తెలిపారు. అనంతరం లీలా గార్డెన్‌లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతారని అశోక్‌ వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పూలే ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా మల్లేశ్వర్‌

కేయూ క్యాంపస్‌: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా కేయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌ నియమితులయ్యారు. కమిటీలో 15మంది కన్వీనర్లు ఉండగా అందులో కేయూ నుంచి మల్లేశ్వర్‌ ఒకరు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బాలమాయదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మల్లేశ్వర్‌ పూలే ఆశయ సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ వాదంతో ముందుకెళ్తున్నారు.

నేడు స్వామి వారి కల్యాణం

రేగొండ: మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నేడు (శనివారం) నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. కల్యాణం అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య అవగాహన సదస్సు

భూపాలపల్లి అర్బన్‌: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి డిపోలో శుక్రవారం ఆర్టీసీ సిబ్బందికి ఆరో గ్య అవగాహన సదస్సు నిర్వహించారు. డిపో మేనేజర్‌ ఇందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తార్నాక ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సుజిత్‌ ఆర్టీసీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణపై విలు వైన సూచనలు అందించారు. ఈ సందర్భంగా సిబ్బందిలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 80 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో అధికారులు అమృత, వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ యాదగిరి, హెల్త్‌ వాలంటీర్‌ చక్రవర్తి, సెక్యూరిటీ హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రాజం పాల్గొన్నారు.

అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా

హన్మకొండ: వేసవిలో అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ టి.మధుసూదన్‌ సూచించారు. వరంగల్‌ ములుగు రోడ్డులోని ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ సర్కిల్‌ కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌ రాజు చౌహాన్‌తో కలిసి ఆయన డీఈలు, ఏఈలు, అకౌంట్స్‌ అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా, బ్రేక్‌డౌన్స్‌, ట్రిప్పింగ్స్‌, బిల్లుల వసూలు, బకాయిలు ఇతర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో నిరంతర విద్యుత్‌ సరఫరా చేసేందుకు మూడు నెలల ముందుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. రెవెన్యూ వసూళ్లు వంద శాతం సాధించాలని, బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో వరంగల్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కె.గౌతంరెడ్డి, డీఈలు రాంబాబు, ఎస్‌.మల్లికార్జున్‌, బక్క దానయ్య, ఏఈలు అకౌంట్స్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement