పూడికతీత.. సాగదీత! | - | Sakshi
Sakshi News home page

పూడికతీత.. సాగదీత!

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత, మట్టి తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాది గడిచినా 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. చెరువు సుందరీకరణ, లోతు, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం లక్ష్యంగా చేపట్టిన ఈ పనులు ఎంతకు పూర్తవకపోవడం నగరవాసులను అసహనానికి గురి చేస్తున్నాయి. తాజాగా అధికారులు చెబుతున్న ప్రకారం.. ఈ ఏడాది మే వరకు పనులు పూర్తి చేయాలని లక్ష్యం. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ తరచూ పరిశీలించి అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

ధరలు తగ్గించి పనులు..

నత్తనడకన పూడికతీత..

గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థ సుమారు 50 ఏళ్ల తర్వాత 2025, జనవరిలో భద్రకాళి చెరువు పూడికతీతపై దృష్టి సారించింది. దీంతో చెరువులో పూడికతీత కోసం నీరంతా ఖాళీ చేశారు. అంతకుముందే పూడికతీత పనుల కోసం పంపించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం రూ.13,00,09,046లతో రెండు పనులకు నీటిపారుదలశాఖ 2025, జనవరి 5, 10 తేదీల్లో టెండర్లు పిలిచింది. ఇందులో ఒక పని చెరువులో పూడిక తవ్వడం, లోడింగ్‌ కోసం క్యూబిక్‌ మీటర్‌కు రూ.53 చొప్పున రూ.3,49,11,446 కేటాయించారు. అదే విధంగా క్యూబిక్‌ మీటరుకు రూ.162.56 చొప్పున 5.85 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని తరలించేందుకు రూ.9,50,97,600లు చెల్లించేలా మరో పనికి టెండర్‌ పిలిచారు. మట్టి తవ్వకం, లోడింగ్‌ ప ని కంటే... పూడిక మట్టి తరలించే పనికి సంబంధించి గతేడాది జనవరి 17, 27 రెండు తేదీల్లో ఎవరూ ముందుకు రాలేదు. దీంతో క్యూబిక్‌ మీటర్‌ రూ.16 2.56ల నుంచి రూ.71.83లకు తగ్గించి పనులు అప్పగించారు. అయినప్పటికీ 7.70 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక తీసి తరలించాల్సి ఉండగా.. ఇప్పటికీ సుమారు రెండు లక్షల క్యూబిక్‌ మీటర్లే తీశారు.

ఆలస్యానికి అనేక కారణాలు..

భద్రకాళి చెరువు పూడికతీత పనులు ఏడాదిలో పూర్తి కావాల్సి ఉండగా.. నిధుల విడుదలో ఆలస్యం, యంత్రాల కొరత, సాంకేతిక సమస్యలను అధికారులు కారణాలుగా చూపుతున్నారు. భద్రకాళి చుట్టూ కొన్ని ప్రాంతాల్లో స్థానికులు అడ్డంకులు కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికి 30 శాతం పనులే కాగా.. అధికారులు చెబుతున్నట్లు మే–జూన్‌ మాసాల నాటికి పూర్తి అనుమానమే అంటున్నారు. పూర్తిస్థాయి డీప్‌ డీసిల్ట్రింగ్‌, బండలు, చెత్త తొలగింపు, చెరువు పరిసరాల అభివృద్ధి (ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ) తదితర పనులు ఎప్పటికీ పూర్తవుతాయన్న అనుమానాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. గతేడాదే పూడికతీత పేరుతో చెరువును ఖాళీ చేయడం వల్ల గ్రేటర్‌ వరంగల్‌ నగరంపై తాగునీటి ప్రభావం పడింది. ఈసారి కూ డా ఆ ప్రభావం మరింతగా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘పనులు త్వరగా పూర్తి చేసి చెరువును పరిరక్షించాలి. గతేడాదిలా ఈసారి ఆ పరిస్థితి రావద్దు’ అని నగరవాసులు కోరుతున్నారు.

ఏడాది గడిచినా పూర్తికాని భద్రకాళి చెరువు పూడికతీత.. మట్టి తరలింపు

14 మాసాల్లో 7.70 లక్షల క్యూబిక్‌ మీటర్లకు తీసింది 2 లక్షల క్యూబిక్‌ మీటర్లే

మే నాటికి పూర్తికాకపోతే తాగునీటికి సమస్య

Advertisement
 
Advertisement
Advertisement