న్యూస్‌రీల్
నాలుగు విడతలుగా డబ్బుల చెల్లింపు
గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బ్యాంక్ రుణాలు
● 4,310 మందికి
అందించేందుకు కార్యాచరణ
● 2,189 మందికి అందజేత
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు గ్రామీణాభివృద్ధి(సెర్ప్) సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇళ్లులేని పేద కుటుంబాలకు చెందిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా పెట్టుబడికి బ్యాంకు రుణాన్ని సెర్ప్ ద్వారా ఇచ్చేలా పథకాన్ని రూపకల్పన చేశారు. పేద ప్రజలు ఇంటి నిర్మాణానికి కావాల్సిన సామగ్రిని ముందుగా డబ్బు పెట్టి కొనుగోలు చేసుకునే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం మహిళా సంఘాల్లో సభ్యులై ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో మహిళా సంఘాల్లో సభ్యులై ఉండి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను 4,310 మందిని అధికారులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 2,189 మందికి రూ.22.87 కోట్ల నగదును బ్యాంకు ద్వారా అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క చొరవతో ప్రత్యేకంగా లబ్ధిదారులకు రుణాలను అందించడం వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. బ్యాంక్ ద్వారా తీసుకున్న రుణాన్ని కిస్తీల వారీగా నెలనెలా బ్యాంక్‌లో చెల్లించాలి. ముందుగా లబ్ధిదారుల నుంచి వడ్డీ, అసలు కలిపి కిస్తీ చెల్లించగా మళ్లీ లబ్ధిదారులకు వడ్డీ సెర్ప్ నుంచి తిరిగి వారి ఖాతాల్లోనే జమ కానుంది. అందువల్లనే దీనిని వడ్డీలేని రుణంగా భావించాలని అధికారులు చెబుతున్నారు.
నూతన నిబంధనలు ఇలా..
ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తుంది. ఇది బాగానే ఉంది. కానీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరులుగా అధికారులు విభజించారు. ప్రస్తుతం ఎల్–1 కేటగిరిలో ఉన్న వారి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం తాజాగా కొన్ని మార్పులు చేసింది. మొదటి, రెండు, నాలుగు విడతలు మినహా మిగిలిన మూడో విడత బిల్లు చెల్లింపులో ఈ మార్పులు చేసింది. ఈ విడతలో బిల్లులను వీబీ జీరామ్‌జీ పథకానికి అనుసంధానం చేశారు. జాబ్‌కార్డు కలిగి ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించి ఆ వేతనం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పునాది పూర్తి చేస్తే రూ.1 లక్ష, గోడలు నిర్మించిన తర్వాత మరో రూ.1 లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.1.40 లక్షలు ఇవ్వగా పనిపూర్తి అయిన తర్వాత రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4.40 లక్షలు చెల్లిస్తున్నారు. అయితే మూడో దశలో స్లాబ్ వేసిన తర్వాత ఉపాధి హామీ కింద రోజుకు రూ. 307ల చొప్పున 90 రోజులకు రూ. 27,630లు చెల్లించనున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద బాత్‌రూమ్ నిర్మించుకుంటే రూ.12వేలు, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ కింద మరో రూ. 21 వేల చొప్పున మొత్తం రూ. 60 వేలను లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లలో జమ చేసేలా ఈ పథకంలో మార్పులు తీసుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉండి ఇల్లులేని అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా చెల్లిస్తుంది. పునాది, గోడలు, స్లాబ్, పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. పునాది దశలో రూ. 1 లక్ష, గోడల నిర్మాణం పూర్తి అయిన తర్వాత రూ. 1 లక్ష, స్లాబ్ దశలో రూ.1.40 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత చెల్లిస్తుంది. ఇదిలా ఉంటే స్థలం లేని వారికి రూ.5 లక్షల సాయంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించడంతో నిరుపేదల సొంతింటి కళ సాకారం అవుతుందని పేద ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.


