మంగపేట: మండల పరిధిలోని 25 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. వేసవిలో భూగర్భ జలాలు పడిపోవడంతో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఎంపీడీఓ భద్రునాయక్‌తో కలిసి బుధవారం డీపీఓ పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో తాగునీటి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమస్య ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలన్నారు. ప్రధానంగా ఉపాధిహామీ పనులు చేసే ప్రదేశాల్లో కూలీలకు షెడ్‌నెట్స్ ఏర్పాటు చేసి నీడ, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ట్రేడ్ లైసెన్స్‌లు పరిశీలించాలన్నారు, నిబంధనలు పాటించని వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో లాడ్జీలు, దాబాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించే ప్రతీ షాపునకు నిబంధనల ప్రకారం లైసెన్సు జారీ చేసి 100 శాతం పన్ను వసూలు చేయాలన్నారు. పలు జీపీలకు పంచాయతీల పరిపాలనపై అవగాహన లేని వారిని ప్రత్యేక అధికారులుగా నియమించగా నిర్వహణను వారు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి స్థానంలో మండల స్థాయి, గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను నియమించాలని కార్యదర్శులు డీపీఓను కోరారు. అనంతరం డీపీఓ ఎంపీడీఓ భద్రునాయక్‌తో కలిసి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. పరీక్షలు ఎలా రాశారని అడిగి తెలుసుకున్నారు. అలాగే మెనూపై ఆరా తీసి స్పెషలాఫీసర్ భాగ్యలక్ష్మికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కిశోర్, కేజీబీవీ ఉపాధ్యాయులు ఉన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య


