ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి అడవిలో జీవిస్తున్న వలస ఆదివాసీలపై అటవీశాఖ చేస్తున్న దాడులను వెంటనే నిలిపేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి.దావూద్ అన్నారు. మండలంలోని గంటల గుంటలో గొత్తికోయలు, ఆదివాసీలతో బుధవారం నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా అడవిలో జీవిస్తున్న గొత్తికోయలపై ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులు అనేకంగా ఉన్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు భూముల చుట్టూ, భూముల్లో కందకాలు తీయడంతో మూగజీవాలు అందులో పడి మృతి చెందుతున్నాయని వాపోయారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో సీతక్క ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి పోడు వ్యవసాయదారులకు కొత్తది నరకేది లేదు.. పాతది వదిలిపెట్టేది లేదని చెప్పిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో మంత్రిగా ఉండి ఫారెస్టు అధికారులు ట్రెంచ్‌లు కొడుతుంటే చూస్తుండడం సరికాదన్నారు. గూడెంను సీపీఎం నాయకులు సందర్శించినప్పుడు ఓ ఆవు కందకంలో కాళ్లు పైకి తల కిందకు పడి కొట్టుమిట్టాడుతుందని తెలిపారు. ఆ సమయంలో ఆవుని ఆ గూడెం ప్రజలు కాపాడారన్నారు. ట్రెంచ్‌లు ఆపకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో రవి, సమ్మయ్య, జోగయ్య, సురేశ్, నగేశ్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు
దావూద్


