ములుగు: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, మహనీయుల ఆశయాలను పాటించడమే వారికి మనమిచ్చే గౌరవమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలకు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. జగ్జీవన్ రామ్ కార్మిక చట్టాలకు ఆద్యుడని తెలిపారు. ఆయన ప్రస్తానం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ మాట్లాడారు. భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా, అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కొమురయ్య, తహసీల్దార్ విజయ భాస్కర్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య వారోత్సవాలను
విజయవంతంగా నిర్వహించాలి
ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆదివారం సంబంధిత విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకుని వారం రోజుల పాటు ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేడు ఆహార భద్రతపై దృష్టి పెట్టి కల్తీ ఆహారం వల్ల వచ్చే జబ్బుల గురించి అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్ వరకు ‘ఈట్ రైట్ వాక్’ నిర్వహించాలన్నారు. 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాలన్నారు. 8న సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా వర్క్ షాప్ నిర్వహించాలన్నారు. 9న ఎయిడ్స్‌పై అవేర్‌నెస్ రెడ్ రన్ వాక్ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు. 10న యోగా డిమానిస్ట్రేషన్ క్యాంపు నిర్వహించాలని పేర్కొన్నారు. 11న డ్రగ్ నియంత్రణ విభాగం ద్వారా ప్రజలకు మందుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డీపీఓ వెంకయ్య, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


