వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని పాలంపేట గ్రామ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్లడించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు.


