ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర నాటికి ఆలయ పునర్నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాలేదు. జాతర సమయం నాటికి కొంత మేరకు పనులు పూర్తి కాకపోవడంతో తాజాగా మళ్లీ పనులను మొదలు పెట్టారు. ప్రహరీ నిర్మాణం, ఆర్చీలపై చెక్కిన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ బొమ్మలు బాగానే ఉన్నా గద్దెల ప్రాంగంణంలో ఫ్లోరింగ్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
పగిలిన గ్రానైట్ రాళ్లు
జాతర సమయంలో హడావుడిగా గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు చేయడంతో గ్రానైట్ రాళ్ల మధ్య సందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల గ్రానైట్ రాళ్లు పగిలిపోయాయి. రాళ్లు కుంగిపోయిన విషయాన్ని జాతర సమయంలో గుర్తించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్కలు సరిచేయాలని ఆదేశించడంతో జాతర అనంతరం మళ్లీ పనులను ప్రారంభించారు. గద్దెల ప్రాంగణంలో కుంగిన గ్రానైట్ రాళ్లను తొలగించి సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు భాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం గద్దెలను ప్రతిరోజూ నీటితో కడగడంతో నీళ్లు గ్రానైట్ రాళ్ల మధ్య నిలిచి పోతున్నాయి. అంతేకాకుండా సమ్మక్క గద్దె వద్ద గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసిన మెట్లరాళ్లు కూడా పగిలిపోయాయి. వాటిని తొలగించి మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు. సమ్మక్క గద్దె నుంచి సారలమ్మ గద్దెకు వెళ్లే మెట్ల వద్ద గ్రానైట్ రాయి పగిలి కుంగిపోయింది. ఇటీవల మేడారం సమ్మక్క పూజారి కుమారుడి కాళ్లపై గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాయి కాలు మీద పడి గాయపడిన ఘటన కూడా చోటు చేసుకుంది.
కంపుకొడుతున్న డ్రెయినేజీ
గద్దెల ప్రాంగణాన్ని నీటితో శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లేందుకు అండర్ డ్రెయినేజీ నిర్మాణం చేశారు. జాతర సమయంలో హడావుడిగా డ్రెయినేజీ నిర్మాణం చేయడంతో దీంతో ఆ డ్రెయినేజీలో చెత్తాచెదారం పేరుకుపోయి గద్దెలను శుద్ధి చేసిన నీళ్లు బయటకు వెళ్లకపోవడంతో దుర్వాసన వస్తోంది. డ్రెయినేజీ నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయిందని భక్తులు విమర్శిస్తున్నారు. మళ్లీ డ్రెయినేజీని సక్రమంగా చేసేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం. మహాజాతరలో మీడియా కవరేజ్ కోసం నిర్మించిన మీడియా పాయింట్ జాతర సమయం వరకు పూర్తి కాలేదు. అయితే మీడియా పాయింట్ కవరేజ్‌కు అనుకూలంగా లేవనే విషయాన్ని గుర్తించిన మంత్రులు జాతర అనంతరం ఆ పనులను నిలిపివేసినట్లు తెలిసింది.
ఆదివాసీ బొమ్మల ఏర్పాటు
గద్దెల చుట్టూ నిర్మించిన రాతి ప్రహరీ పైభాగంలో రాతితో చెక్కిన ఆదివాసీ బొమ్మలను అమర్చుతున్నారు. అయితే ఓ రాతి బొమ్మ కొమ్ము విరిగిపోవడంతో దాన్ని గమ్ముతో అతికించి ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేశారు. అధికారులు విరిగిన కొమ్ము బొమ్మను పక్కన పెట్టించాలని భక్తులు కోరుతున్నారు.
మేడారంలో కొనసాగుతున్న
ఆలయ పునరుద్ధరణ పనులు
కంపుకొడుతున్న అండర్ డ్రెయినేజీ


