భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల సమస్యలకు ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి కంపేటి రాజయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఏరియాలోని కేటీకే 6వ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మెడికల్ బోర్డు నిర్వహణ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. అసెంబ్లీ వేదికగా సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు అయిన అలవెన్సులు, ఆదాయపన్ను మాఫీ, సొంత ఇంటికల, మారుపేర్ల, ఇతర అంశాలకు పరిష్కారం దొరుకుతుందని భావించిన కార్మికుల ఆశలు నెరవేరలేదన్నారు. వేజ్‌బోర్డులో చేసుకున్న ఒప్పందాలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదని, గెలిచిన సంఘాలు వాటిని అమలు చేయించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేకపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీనివాస్, శ్రీకాంత్, తోట రమేష్, బాబురావు పాల్గొన్నారు.


