అభివృద్ధిలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ములుగు/వెంకటాపురం(ఎం)/ గోవిందరావుపేట: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ములుగు మున్సిపాలిటీలోని 6వ వార్డులో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ అధ్యక్షతన గురువారం నిర్వహించిన వార్డు సభకు సీతక్క హాజరై మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి రూ.1.25కోట్లతో ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా రూ.50 కోట్లతో సీసీ రోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం పనులను ఈనెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.57 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, జిల్లా గ్రంథాలయం చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం) మండల కేంద్రంలోని పీవీ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక గ్రామసభ సర్పంచ్‌ మామిడిశెట్టి సుగుణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతాయన్నారు.ఇందిరమ్మ ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకాలు లబ్ధిదారులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయిలో గ్రామ సర్పంచ్‌ మేకల రాధసుదర్శన్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్‌, కలెక్టర్‌ దివాకరతో కలిసి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం మహిళ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితరామచంద్రన్‌ మాట్లాడుతూ గ్రామంలో కొత్త రేషన్‌ కార్డులు అందించామని తెలిపారు. అలాగే 73 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. చల్వాయి గ్రామంలోని లక్నవరం క్రాస్‌ వద్ద ఉన్న కిచెన్‌ షెడ్‌లో మంత్రి సీతక్క, అనిత రామచంద్రన్‌, కలెక్టర్‌ దివాకరలతో కలిసి అంగన్‌ వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం నూతన స్మార్ట్‌ఫోన్లను అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కల్యాణి, పంచాయితీరాజ్‌ డైరెక్టర్‌ భగవాన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement