● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ములుగు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలుపై రేపటి (గురువారం) నుంచి నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రామ సభలలో ప్రజలకు అందించే సమాచారం ఒకే రీతిన ఉండాలన్నారు. గ్రామ సభల నుంచి వార్డు మెంబర్ నుంచి ఎంపీ, మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. గ్రామ సభల్లో సీఎం సందేశం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లను చదివి వినిపించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డు, సన్న బియ్యం సరఫరా, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న లబ్ధిదారులతో గ్రామసభలలో మాట్లాడించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలందరికీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం తెలిసే విధంగా వార్డు సభలు నిర్వహించాలని తదితర అంశాలను వెల్లడించారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


