ములుగు: మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం – ఉత్సవాలు 2026’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 29 నాటికి రూ.290 కోట్ల ప్రయాణాల ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలు ఆదా అయ్యాయని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల జీవితాల్లో వెలుగు నింపుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతీ కుటుంబం ఆర్థికంగా స్థిరపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ములుగు జిల్లాల్లో ఇప్పటి వరకు 1.90 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు రూ.133.25 కోట్లు ఆదా చేసుకున్నారని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుందన్నారు. వాటిని అర్హులందరికీ అందేలా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని వివరించారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తూ త్వరలోనే సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల్లో 18 ఏళ్లు నిండిన వారు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఆర్టీసీ డీఎం.రవిచందర్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్, తదితరులు, పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


