33 అంశాలపై
సమాచార సేకరణ
తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో వివరాల నమోదు
గృహ గణనను సమర్థవంతంగా నిర్వహిస్తాం..
ములుగు: జిల్లాలో గృహగణన నమోదు కార్యక్రమాన్ని చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. 2011 జనాభా లెక్కల తర్వాత ఇంతవరకు జన గణన జరగలేదు. జన గణన కార్యక్రమంలో భాగంగా తొలి ప్రాధాన్యతలో భాగంగా గృహ గణన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలిసారిగా డిజిటల్ విధానంలో గృహ గణనను నిర్వహిస్తుంది. గృహ గణన కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బందిని నియమించనున్నారు. గతంలో కాగితాల్లో వివరాలు రాసి నమోదు చేసేవారు. ఈ సారి మాత్రం లోపాలకు తావులేకుండా డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించనుండడంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
వచ్చేనెల 11 నుంచి ప్రారంభం
జిల్లాలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహ గణన కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 78,635 గృహాలు ఉండగా 3,20,242 జనాభా ఉంది. గృహ గణన అనంతరం జన గణన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు నెల రోజల పాటు గృహ గణన చేసేందుకు అధికారులు జాబితాను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో గృహ గణనకు సంబంధించిన కార్యక్రమంపై దృష్టిపెట్టనున్నారు. గృహ గణన కార్యక్రమంలో 300 గృహాలకు లేదా 700 జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించనున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి మంది ఎన్యుమరేటర్లు జన గణనలో పాల్గొనున్నట్లు తెలిసింది. జిల్లా ప్రణాళిక, రెవెన్యూ శాఖల సమన్వయంతో గృహ, జన గణన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
గృహ గణనలో 33 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. ఇంటి నంబర్, ఇంటి నిర్మాణానికి వాడిన మెటీరియల్, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి యజమాని వివరాలు, ఇల్లు సొంతమా, అద్దెనా, తాగునీటి సౌకర్యం, డ్రెయినేజీ వ్యవస్థ, మరుగుదొడ్ల వివరాలు, వంట గది సౌకర్యం, రేడియో, టీవీ, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్, ద్విచక్ర వాహనాలు, కారు ఉందా అనే అంశాలతో పాటు మొత్తంగా 33 ఆంశాలను ప్రతీ ఇంటికి వెళ్లి గృహ గణనలో భాగంగా వివరాలు నమోదు చేయనున్నారు. ఇలాంటి వివరాలను ఇంటి యజమానే నేరుగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.
మే 11 నుంచి ప్రారంభం
ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందితో సర్వే
2027 జన గణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహ గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చాం. మొదటిసారిగా డిజిటల్ విధానంలో గృహ గణన కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ప్రతీ ఇంటిని ఎన్యుమరేటర్లు సందర్శించి సరైన సమాచారాన్ని నమోదు చేస్తారు. గృహ, జన గణన ఆధారంగానే అభివృద్ధి పథకాలు రూపొందించబడుతాయి.
– టీఎస్.దివాకర, కలెక్టర్


