ములుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ దివాకర తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామసభల నిర్వహణపై అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావుతో కలిసి కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, సాయిల్ హెల్త్‌కార్డు, వ్యవసాయ తదితర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. గ్రామసభల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామసభల నిర్వహణకు ముందస్తుగానే షెడ్యూల్ తయారు చేసి పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామ పంచాయతీలో జరిగే సభకు అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హౌసింగ్, ఇరిగేషన్, విద్యుత్‌శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ తప్పనిసరిగా గ్రామసభలకు హాజరు కావాలని తెలిపారు. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా టెంట్లు, కుర్చీలు, తాగునీరు ఇతర మౌలిక వసతులను కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి కోసం గ్రామభలో ప్రత్యేకంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్వీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆపోహలు పడవద్దని, జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎల్‌పీజీ, లక్ష్మీ హెచ్‌పీ గ్యాస్ గోదాంను సివిల్ సప్లయీస్ అధికారి సయ్యద్ షా ఫైనల్ హుస్సేనీతో కలిసి కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్లను, స్టాక్ నిల్వలు పరిశీలించి ఎప్పటికప్పుడు స్టాక్ నిల్వలు రిజిస్ట్రార్‌లో నమోదు చేయాలని సూచించారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


