జన గణన సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

జన గణన సమర్థవంతంగా నిర్వహించాలి

Mar 31 2026 7:32 AM | Updated on Mar 31 2026 7:32 AM

ములుగు: జన గణన–2027 మొదటి విడతలో భాగంగా చేపట్టనున్న జన గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌, జనగణన సంచాలకులు భారతి హోళీకేరి సూచించారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్‌లో జన గణన, ఇళ్ల గణన, మ్యాప్‌ తయారీ, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇళ్ల గణన ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులందరూ పూర్తి అవగాహనతో పని చేయాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్‌ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతీ కుటుంబానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. సన్నాహక చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యాప్‌ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, గణన ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలాల వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం చేపట్టాలని తదితర అంశాలపై సూచించారు. అనంతరం కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ జిల్లాలో జన గణన–2027 మొదటి విడత ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమన్వయంతో సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సీహెచ్‌ మహేందర్‌ జీ, సూపరింటెండెంట్‌ మంజుల, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ భారతి హోళీకేరి

Advertisement
 
Advertisement
Advertisement