వెదురుతో ఆదాయం | - | Sakshi
Sakshi News home page

వెదురుతో ఆదాయం

Mar 30 2026 7:24 AM | Updated on Mar 30 2026 7:24 AM

వెదురుతో ఆదాయం అందుబాటులో మొక్కలు

మార్కెట్‌లో

ఫుల్‌ డిమాండ్‌

రైతులకు ఉచితంగా అందజేయనున్న మొక్కలు

ఏటూరునాగారం: వెదురు మొక్కల పెంపకంతో లక్షల రూపాయల ఆదాయం పొందే పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. ఏడాదికి రూ. ఒక లక్ష నుంచి ఆపై ఆదాయం పొందేలా పథకాన్ని రూపొందించారు. ఆసక్తి గల రైతులకు మొక్కలు ఉచితంగా ఇవ్వనున్నారు. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి సదరు రైతులు ఆదాయం పొందవచ్చు. ఈ మేరకు ఏజెన్సీ మండలాలైన ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మొదటగా మొక్కలు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏటూరునాగారంలోని ఇండస్ట్రీ ఫౌండేషన్‌ ఎన్‌జీఓ ద్వారా 5 లక్షల మొక్కలను పెంచి సెర్ప్‌ ద్వారా రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇండస్ట్రీ ఫౌండేషన్‌ 2 లక్షల తుల్డా, ల్యాగిస్టాటిస్‌ అనే వెదురు రకాల మొక్కలను నర్సరీలో పెంచుతోంది. ఇంకా 3 లక్షల మొక్కలను పెంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేసేలా ఫౌండేషన్‌ ప్రతినిధులు ప్రభుత్వంతో అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు.

ప్లాస్టిక్‌ నిర్మూలనే

లక్ష్యంగా..

ప్లాస్టిక్‌ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఇంట్లో ప్లాస్టిక్‌ వస్తువులను వాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అలాంటి ప్లాస్టిక్‌ మహమ్మారిని తరిమివేయడానికి ప్రత్యామ్నాయంగా వెదురుతో తయారు చేసిన క్లాత్‌లు, సంచులు, ఫర్నీచర్‌, బాటిల్స్‌ తయారు చేయిస్తాం.. అలాగే ఇతర వస్తువులను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికే వెదురు సాగును మరింత విస్తరింపజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వెదురు సాగుతో లాభాలు ఇలా..

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం 75 వేల మంది రైతులకు ఉపాధి కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించింది. నాటిన 3–4 సంవత్సరాల నుంచి కాపు మొదలై 50 ఏళ్ల వరకు వస్తుంది. నీరు నిల్వ ఉండని సారవంతమైన నేలలు, ఏటవాలు ప్రాంతాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. కాగితం పరిశ్రమ, ఫర్నీచర్‌, హస్తకళలు, అగర్‌బత్తీల తయారీకి ఈ కర్రను భారీగా వినియోగిస్తారు. రైతులకు ఉచితంగా మొక్కలను ప్రభుత్వం ఈజీఎస్‌ ద్వారా అందిస్తుంది. మొక్క సంరక్షణకు నెలకు రూ.12.53ల చొప్పున 30 నెలల పాటు చెల్లించే అవకాశం ఉంది. పట్టాదార్‌ పాస్‌ బుక్‌, ఆధార్‌కార్డు, ఉపాధి హామీ జాబ్‌కార్డుల జిరాక్స్‌లను మండల ఈజీఎస్‌ అధికారులకు మొక్కలు కావాల్సిన రైతులు ఇవ్వాల్సి ఉంటుంది.

జిల్లాలోని ఆరు మండలాల్లోని రైతులకు ఉచితంగా మొక్కలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్న ప్రతీ రైతు ఈ వెదురు సాగును చేయవచ్చు. వెదురు మొక్కలను పెంచడం వల్ల అత్యంత ఆదాయంతో పాటు తక్కువ పెట్టుబడితో ఎక్కవ రోజులు దిగుబడి పొందే అవకాశాలున్నాయి. రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకు రావాలి. ఏటూరునాగారంలోనే నర్సరీ ఉండడం వల్ల వెదురు ఎన్ని మొక్కలు అయినా ప్రభుత్వం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసింది.

– చరణ్‌రాజ్‌, ఈజీఎస్‌ ఏపీఓ, ఏటూరునాగారం

వెదురు సాగుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులతో పెట్రోలియం, గ్యాస్‌ ఉత్పత్తులు సైతం కొరత ఏర్పడే అవకాశాలు ఉండడంతో వెదురు సాగు మరింత వేగవంతం చేశారు. వెదురు కు మార్కెట్‌లో అత్యంత డిమాండ్‌ నెలకొంది. కిలో వెదురును రూ. 10ల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. టన్నుకు రూ.10వేలు రైతులకు ధర పలికే అవకాశం ఉంది. ఇలా 50 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తూనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పైలట్‌ ప్రాజెక్టుగా ఏజెన్సీ మండలాలు

నెలకు ఒక్కో మొక్కకు రూ.12.53 చెల్లించనున్న ప్రభుత్వం

నర్సరీలో రెండు లక్షల మొక్కలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement