● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు: జనగణన–2027లో భాగంగా మొదటి విడతలో చేపట్టే ఇళ్ల గణన ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీతో కలిసి తహసీల్దార్లు, డీటీలు, ఎంపీఎస్‌ఓలు, ఆర్‌ఐలతో జన గణన, ఇళ్ల గణన ప్రక్రియలు, మ్యాప్ తయారీపై కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జన గణన కార్యక్రమంలో భాగంగా ప్రక్రియ నిర్వహణ, సాంకేతికత వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గణన చేయాలని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా జన గణనను పూర్తిగా డిజిటల్ పద్ధతి ద్వారా చేపట్టినట్లు తెలిపారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9వరకు జన గణనలో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఇళ్ల గణనలో కుటుంబాల వివరాలు పూర్తిగా నమోదు చేయబడతాయన్నారు. సన్నాహక పనులు మొదలు పెట్టాలని వివరించారు. యాప్ నిర్వహణలో ఎటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలన్నారు. చార్జెస్ (మండలాల) వారీగా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల నియామకం చేపట్టాలన్నారు. 800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాలని, ఎన్యుమరేటర్ హౌస్ లిస్టింగ్, బ్లాక్ తయారు చేసి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ముఖ్య ప్రణాళిక అధికారి ప్రకాశ్, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మంజుల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి టెలికం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్‌వర్క్ సేవలందించాలని అధికారులను ఆదేశించారు. టెలికాం టవర్ల ఏర్పాటులో ఎదురవుతున్న అనుమతుల సమస్యలు, టవర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో ఉన్న జాప్యాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్‌డీఓ శ్రీనివాస్, టెలికాం కంపెనీల ప్రొవైడర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలోని కోచిలో నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(స్కిల్ డెవలప్‌మెంట్)లో వచ్చే నెలలో ప్రారంభమయ్యే తదుపరి బ్యాచ్ కోసం రాష్ట్రంలోని గిరిజన యువతకు 25 సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ దివాకర శనివారం తెలిపారు. శిక్షణకు వెళ్లే వారికి ఉచిత వసతి, భోజనం, లెర్నింగ్ మెటీరియల్స్, యూనిఫాం, సేఫ్టీ షూస్, శిక్షణ అనంతరం నేషనల్ కౌన్సెలింగ్ ఫర్ ఒకేషనల్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా సర్టిఫికెట్ ప్రదానం చేసి ఉపాధి కల్పిస్తారని తెలిపారు. ఈ అవకాశాలన్ని గిరిజన యువతీయువకులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తేదీలోపు ఆన్‌లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ ఎలక్ట్రిషియన్(ఆయిల్, గ్యాస్), ఇండస్ట్రీయల్ వెల్డర్(ఆయిల్,గ్యాస్), ప్రాసెస్ ఇన్‌స్ట్రమెంటనేషన్ టెక్నిషియన్, ఫిట్టర్ ప్యాబ్రికేషన్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కోర్సు వ్యవధి ఆరు నెలల పాటు ఉంటుందని వివరించారు. విద్యార్హతలు టెక్నికల్ డిప్లామా, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని కలెక్టర్ వెల్లడించారు.


