● రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి
గోవిందరావుపేట: గతేడాది ఏప్రిల్ 7న కురిసిన వడగళ్ల వానకు పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా గ్రామంలో రైతుసంఘం మండల కమిటీ సమావేశం గుండు రామస్వామి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వడగళ్ల వానలతో మండలంలోని వేలాది ఎకరాల్లో పంటలు 50 నుంచి 80 శాతం వరకు దెబ్బతిన్నాయన్నారు. రైతు సంఘం ఆందోళనలతో అధికారులు సర్వే చేసి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. స్పందించిన ప్రభుత్వం ఎకరాకు రూ.19వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించిందని వెల్లడించారు. ఆ నష్టపరిహారం ఇప్పటి వరకు బాధిత రైతుల అకౌంట్లలో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాకు విడుదల చేసిన రూ.5.72 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతుసంఘం నాయకులు కోటేశ్వరరావు, సూర్యనారాయణ, భిక్షం, లెనిన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.


