ఆపద్బాంధవులు | - | Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవులు

Mar 28 2026 7:17 AM | Updated on Mar 28 2026 7:17 AM

పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలు

ఆపదలో ఆదుకుంటున్న 108 సిబ్బంది

ఏడాదిలో 18,886 కేసులకు స్పందన

అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు

గిరిజన ప్రాంతంలో ఘనమైన సేవలు

ములుగు: బండారుపల్లిలో హాజరైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చంద్రకళ

ములుగు: అడవులు, కొండలు, రహదారి సరిగా లేని మారుమూల గ్రామాలు, అడవుల్లో నివాసముంటున్న గొత్తికోయల ఆవాసాలు. దూరప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ గ్రామాలతో కూడిన జిల్లా ములుగు. ఇక్కడ అత్యవసర వైద్యసేవలు అందించడం సవాల్‌తో కూడిన సహవాసం. వర్షాకాలంలో పొంగి ప్రవహించే వాగులు, వంకలు, గిరిజన గ్రామాల్లో మొబైల్‌ సిగ్నల్స్‌ లేక అవస్థలు పడుతున్న ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి 108 అంబులెన్స్‌ సిబ్బంది సేవలు. ప్రాంతం ఏదైనా పల్లె ఎక్కడ ఉన్నా.. అత్యవసర సమయాల్లో వచ్చే ప్రతీ కాల్‌కు స్పందిస్తూ రాత్రింబవళ్లు నిరంతరం సేవలు అందిస్తూ ప్రతీ ప్రాణాన్ని కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తూ పునర్జన్మ ప్రసాదించే ప్రాణదాతలుగా నిలుస్తున్న 108 సిబ్బందిపై సాక్షి ప్రత్యేక కథనం.

10 మండలాలు..14 అంబులెన్స్‌లు

ములుగు జిల్లా 10 మండలాల పరిధిలోని 171 గ్రామ పంచాయతీలతో పాటు, ములుగు మున్సిపాలిటీ పరిధితో కలిపి 14 అంబులెన్స్‌ల సిబ్బంది నిరంతరం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. 108 అంబులెన్స్‌లో పైలట్‌ (డ్రైవర్‌)తో పాటు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ (ఈఎంటీ) ఉంటారు. 108కు కాల్‌ రాగానే సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స చేయడం, రోగిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 108 అంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తితో అనేక మంది ప్రాణాలు నిలుస్తున్నాయి.

అంబులెన్స్‌లో ప్రసవాలు అనేకం

డెలివరీ కేసులపై 108 సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గర్భిణులు నొప్పులు మొదలు కావడంతో కుటుంబసభ్యులు 108కి కాల్‌ చేయడం, వెంటనే అక్కడకు చేరుకొని ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో అనేక మంది గర్భిణులకు 108 అంబులెన్స్‌లోనే సిబ్బంది పురుడు పోసి తల్లి, శిశువు క్షేమంగా ఉండేలా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏడాదిలో సుమారు 60 మందికి పైగా గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలు క్షేమంగా ఉండేలా సేవలందించారు. రోడ్డు ప్రమాదం జరిగిన, గుండెపోటు వచ్చిన ఆస్పత్రికి వెళ్లేలోపు గోల్డెన్‌ ఆవర్‌లో చికిత్స ఎంతో అవసరం, ఈఎంటీ ప్రాథమిక చికిత్స చేస్తే పైలట్‌ ట్రాఫిక్‌ సమస్యను దాటుతూ ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని కంటికిరెప్పలా కాపాడుతూ సరైన సమయంలో ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు నిలబెడుతూ వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.

18,886 కేసులకు స్పందన

ప్రమాదం, ప్రసవవేదన, జ్వరం, పాముకాటు, శ్వాస ఇబ్బంది, గుండెపోటు, జబ్బు ఏదైనా సకాలంలో వైద్యం అందకపోతే నిండు ప్రాణాలు గాలిలో కలవక తప్పదు. ఏ అత్యవసర పరిస్థితి అయినా మేమున్నామంటూ.. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు రక్షిస్తూ మెరుగైన సేవలందిస్తున్నారు. జిల్లాలో 2025 మార్చి 31 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు 18,886 కేసులకు స్పందించి వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ సకాలంలో ఆస్పత్రికి చేర్చారు. 1,569 రోడ్డు ప్రమాద కేసులు, 2,461 గర్భిణుల కేసులు, 827 మంది సృహ కోల్పోయిన కేసులు, 2,437 కడుపునొప్పి కేసులు, 1,251 శ్వాసకోస సంబంధిత కేసులు, 953 డొమెస్టిక్‌ ప్రమాదాలు, 932 గుండెనొప్పి సంబంధిత కేసులు, 863 పాయిజన్‌ కేసులు, 647 ఫిట్స్‌ కేసులు, 368 ఆత్మహత్యాయత్నం కేసులు, 271 పెరాలసిస్‌ కేసులు, 445 జంతు దాడి కేసులు, 46 బర్నింగ్‌ కేసులు, 5,816 ఇతర సంబంధిత కేసులకు సకాలంలో స్పందించి వైద్యసేవలు అందించారు.

ఆపదలో ఆదుకోవడమే మా కర్తవ్యం

ఆపద సమయంలో ఆదుకోవడమే మా కర్తవ్యం. బాధితులు ఫోన్‌ చేసిన వెంటనే సాంకేతికత ద్వారా ఎక్కడి నుంచి ఫోన్‌ వచ్చిందో తెలుసుకొని సంఘటనకు దగ్గరలో ఉన్న 108 సిబ్బందికి సమాచారం అందిస్తాం. వాహనం 30 సెకన్లలోపే బయలు దేరి దూరాన్ని బట్టి సకాలంలో ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం.

–శివకుమార్‌,

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌

నిత్యం అందుబాటులో..

108 సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 108 ఉచిత సేవలను ప్రజలు వినియోగించుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందిస్తారు. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేస్తారు.

–రాజ్‌కుమార్‌, 108 జిల్లా మేనేజర్‌

అంబులెన్స్‌లో వైద్యం

కన్నాయిగూడెం : పొట్టకూటి కోసం పనికి వచ్చి సొమ్మసిల్లి ప్రాణాపాయస్థితికి వెళ్లిన ఓ వ్యక్తికి 108 సిబ్బంది అంబులెన్స్‌లో వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన మండలంలోని ఏటూరులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన ఉప్పుటూరి లక్ష్మయ్య మేసీ్త్ర పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇళ్లు నిర్మించేందుకు మండలంలోని ఏటూరు గ్రామానికి వచ్చాడు. అతడికి షుగర్‌ లెవల్స్‌ తగ్గే సమస్య ఉన్నట్లు తెలిసింది. లక్ష్మయ్యకు శుక్రవారం ఒక్కసారిగా షుగర్‌ లె వల్‌ పూర్తిగా తగ్గడంతో సొమ్మసిల్లి పడిపోయి ప్రాణపాయ స్థితికి వెళ్లాడు. గమనించిన తోటికూలీలు 108కు సమాచారం అందించారు. మండలంలోని 108 వాహన సిబ్బంది సంఘటన వద్దకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మయ్యను ఈఎంటీ కల్యాణ్‌ చికిత్స చేసి పైలెట్‌ సతీష్‌ సహకారంతో ఏటూరునాగారంలోని సీహెచ్‌సీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement