● రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు రామారావు
మంగపేట: ప్రభుత్వం అన్నదాతలకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే చేసేవరకు ఉద్యమిస్తామని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో ఆ సంఘ నాయకులతో కలిసి చలో కరీంనగర్ రైతు మహాగర్జన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28న లక్షమందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరీ సభను విజయవంతం చేయాలన్నారు. హామీలను నెరవేర్చేలా ప్రభుత్వానికి, పాలకులకు మనసు మార్చాలని కోరుకుంటూ లక్ష్మీనర్సింహాస్వామికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సభ డిమాండ్లను అమలు చేయాలని, లేదంటే ప్రజా సంఘాలు, రైతులు, విద్యార్థి సంఘాల మద్దతుతో దశల వారీగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెడ్యాల రాంరెడ్డి, ప్రజా సంఘాల జాతీయ నాయకులు అయిత నాగరాజు, రాజయ్య, అంజయ్య, తదితరులు ఉన్నారు.
రూ.200కోట్ల స్కాం ఎలా అవుతుంది?
● మేడారం ట్రస్టు బోర్డ్ చైర్‌పర్సన్ సుకన్య
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు అయితే రూ.200 కోట్ల స్కాం ఎలా అవుతుందని మేడారం ట్రస్టు బోర్డ్ చైర్‌పర్సన్ ఇర్ప సుకన్యసునీల్ దొర ప్రశ్నించారు. ఆలయ ప్రాంగణ పునర్నిర్మాణం, జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ గుంటురు సతీష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం స్పందించారు. మేడారం జాతరకు మీరు చేసిన సేవలేమిటో ముందుగా చెప్పాలని, నాలుగు నెలలకొకసారి వచ్చి ఆరోపణలు చేసి వెళ్లడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. జాతర సమయంలో మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టాత్మకంగా ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సమయాభావం ఉన్నప్పటికీ ఇతర పనులను ఆపి ప్రాంగణ పనులను పూర్తి చేసిన ఘనత మంత్రి సీతక్కదేనన్నారు. ఆదివాసీ సంప్రదాయం, సమ్మక్క–సారలమ్మ తల్లుల వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయడమే మంత్రి సీతక్క లక్ష్యమని, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మానుకుని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. జిల్లా ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఇకనైనా సతీష్‌రెడ్డి వైఖరి మార్చుకోవాలన్నారు.


