మహిళల భద్రతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు పెద్దపీట

Mar 27 2026 9:26 AM | Updated on Mar 27 2026 9:26 AM

మహిళల భద్రతకు పెద్దపీట

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

ములుగు: నిర్భయ నిధులతో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర తెలిపారు. మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో ‘ఇన్‌ క్లూజివ్‌ సిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ అండ్‌ గర్ల్స్‌’ పైలట్‌ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని తన ఛాంబర్‌లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో మహిళల భద్రతకు తీసుకునే చర్యలపై సంబంధిత అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు, బాలికలకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతంగా ఉండేలా పింక్‌ ఆటోస్‌ వంటి సౌకర్యాలను కల్పించామన్నారు. జన సమూహ కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటు, వివిధ పనులు చేస్తున్న బాలింతలు, వారి శిశువుల భద్రత, పరిరక్షణకు పని ప్రదేశాల్లో ప్రత్యేక క్రెష్‌ సెంటర్ల ఏర్పాటు, డే కేర్‌ సెంటర్లను జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలైన మేడారం, లక్నవరం, రామప్ప, బొగత, మల్లూరు, దేవాదుల మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సంపత్‌ రావు, డిడబ్ల్యూఓ ప్రేమలత, మున్సిపల్‌ కమిషనర్‌ రమేశ్‌, ఆర్టీఓ శ్రీనివాస్‌, డీఎంసీ రమ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అలాగే జిల్లాలో ప్రజలకు సరిపడా ఇంధన, ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్‌ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కోసం ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హేమాచలక్షేత్రం అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌

మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మాస్టర్‌ ప్లాన్‌ను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్‌ దివాకర అధికారులను ఆదేశించారు. హేమాచలక్షేత్రాన్ని కలెక్టర్‌ దివాకర దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు, ఆలయ పూజారులతో కలిసి ఆలయ ప్రాంగణం పరిశీలించారు. ఏప్రిల్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు, వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కల్పించాల్సిన వసతులపై సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement