● జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు
ములుగు: జిల్లాలో కూరగాయల సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, రైతులకు అదనపు ఆదాయం కల్పించడానికి కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేస్తున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో రైతులకు వెజిటబుల్ మిని కిట్లను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. ఆసక్తి గల రైతులకు రూ. 500 విలువ గల ఐదు రకాల కూరగాయల విత్తనాల కిట్లను అందిస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ పెట్టుబడితో తక్కువ విస్తీర్ణంలో అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఎక్కువ ధరలకు కూరగాయలు కొనుగోలు చేయకుండా జిల్లాలో 625 ఎకరాల్లో సాగు చేసేందుకు 1250 వెజిటబుల్ కిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కిట్‌లో టమాట, మిర్చి, బెండ, గోడుచిక్కుడు, పాలకూర విత్తనాలు ఉంటాయని, ఇవి 20 గుంటలకు విత్తనాలు సరిపోతాయని వివరించారు. ఆసక్తి గల రైతులు పటా పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఫొటోతో జిల్లా కార్యాలయంలో అందజేసి కిట్‌ను పొందాలని సూచించారు.వివరాలకు సెల్ నంబర్ 7702383263లో సంప్రదించాలని వెల్లడించారు.


