న్యూస్‌రీల్
రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.23.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. కోటంచ దేవస్థానంలో వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించినట్లు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 28 గ్రాములు, మిశ్రమ వెండి 1.3 కిలోలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు అనిల్‌కుమార్, సర్పంచ్ సావటి మెగిళి, జీపీఓ రవీందర్, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి, కొడవటంచ భజన బృందాలు పాల్గొన్నారు.
ములుగు రూరల్: నేటి డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్– 2డిపో మేనేజర్ రవిచందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (గురువారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు జిల్లా ప్రజలు ఆర్టీసీ సమస్యలపై ఫోన్ ద్వారా సంప్రదించి వివరించాలని సూచించారు. ఫోన్ నంబర్ 9959558556కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందించాలని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భద్రకాళి అమ్మవారికి
పుష్పార్చన
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చా మంతి పూలకు సంప్రోక్షణ జరిపి అ మ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధ ర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. అ లాగే, కాసం పుల్లయ్య వస్త్ర దుకాణం అధినేత కాసం నమశ్శివాయ ఆలయానికి 16 ఎల్‌ఈడీ లైట్లను అందజేశారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీకబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు.
ప్రమాద బీమా చెక్కు
అందజేత
భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సింగరేణి సెక్యూరిటీ గార్డ్ నేరుపాటి మొగిలి కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును బుధవారం అందజేసినట్లు బ్రాంచీ మేనేజర్ రామస్వామి తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదగా బ్యాంక్ ఆవరణలో చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలో ఇంకా సుమారు 60 మంది ఉద్యోగులు ఈ సౌకర్యం లేని బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్నారని, వారు ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకుల్లోని కార్పొరేట్ శాలరీ ఇన్సూరెన్స్ పథకంలోకి మారాలని సూచించారు. గనులు, విభాగాల వారీగా ఖాతాలు మార్చుకోవాల్సిన వారి సంఖ్యను వివరించారు. డిపార్ట్‌మెంట్లలో 12 మంది, కేటీకే–1లో 12 మంది, కేటీకే–5లో 9 మంది, కేటీకే–6లో 13 మంది, కేటీకే–8లో 8 మంది, కేటీకే ఓసీ–2లో ఆరుగురు ఉన్నట్లు తెలిపారు.
వేయిస్తంభాల ఆలయంలో
లక్షతులసి అర్చన
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులకు విశ్వక్సేనారాధన, పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు చేశారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్ష తులసి అర్చన చేశారు.
హెచ్‌ఎన్‌టీసీలో మొక్కల పెంపకానికి ఐటీడీఏ అధికారుల కసరత్తు
ఏటూరునాగారం: పండ్ల తోటల పెంపకానికి ఐటీడీఏ పక్కా ప్లాన్ వేసింది. ఈ మేరకు ఎక్కెల గ్రామంలోని ఐటీడీఏ పరిధిలో గల హర్టికల్చర్ నర్సరీ ట్రైనింగ్ సెంటర్(హెచ్‌ఎన్‌టీసీ) స్థలాన్ని అధికారులు బ్లాక్‌లుగా విభజించారు. 20 ఎకరాల స్థలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇటీవల సాక్షిలో ‘మోడల్’ ప్లాంటేషన్ శీర్షికన కథనం ప్రచురితం కాగా కలెక్టర్ దివాకర స్పందించారు. ఈ విషయంపై ఐటీడీఏ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్ పంటగా పండ్ల మొక్కలను నాటి పెంచాలని సూచించారు.
నీటి వసతికి అధికారుల ప్రయత్నాలు
గతంలో ఆయిల్‌పామ్ మొక్కలను అధికారులు నాటించారు. ఆ మొక్కలకు నీటి వసతికి సంబంధించి బోర్లు వేయించారు. అధికారులు మొక్కలు నాటించి గాలికి వదిలేశారు. దీంతో విద్యుత్ స్టార్టర్ సైతం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించిన అధికారులు స్టార్టర్ మరమ్మతులతో పాటు పైపులైన్లు, డ్రిప్ సిస్టంను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంజనీర్ల సాయంతో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు.
ఒక్కో ఎకరంలో ఒక్కో రకం మొక్కలు
హెచ్‌ఎన్‌టీసీ స్థలంలో వివిధ రకాల పండ్ల మొక్కలను ఒక్కో ఎకరంలో ఒక్కో రకం మొక్కలు పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారుగా 20 ఎకరాలు ఉన్న స్థలాన్ని బ్లాక్‌లుగా విభజించారు. ఐటీడీఏ అధికారులు ఎక్కడ ఎలాంటి పండ్ల మొక్కలను పెంచాలనే అంశాలపై ప్లాన్ చేశారు. ఈ ప్లాన్‌ను కలెక్టర్, ఇన్‌చార్జ్ ఐటీడీఏ పీఓ దివాకరకు వివరించి అప్రోల్ తీసుకునే అవకాశాలున్నాయి.
ములుగు రూరల్: అంగన్‌వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు సంపూర్ణమైన పౌష్టికాహారం అందుతుందని ములుగు సీడీపీఓ శిరీష అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని ఇంచర్లలో రైతు వేదికలో అంగన్ వాడీ టీచర్లు, ప్రజా ప్రతినిధులతో 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహారం మిషన్ 2.0 ప్రాముఖ్యతను వివరించారు. అలాగే అమ్మబాట అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. కేంద్రాలలో చేపట్టే కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు స్థలం కేటాయించాలన్నారు. జూన్ 12వ తేదీ వరకు అంగన్‌వాడీ కేంద్రాలలో రోజువారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ ఓంకార్, ములుగు ప్రాజెక్టు పరిధిలోని సర్పంచ్‌లు, ములుగు కౌన్సిలర్లు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
అట్రాసిటి కేసుల పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నమోదైన అట్రాసిటి కేసులు, పరిష్కారమైన కేసులు, బాధితులకు అందిన పరిహారం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కేసు పుర్వాపరాలను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ విధివిధానాల మేరకు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అనంతరం ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌భట్ మాట్లాడుతూ అట్రాసిటి కేసుల విషయంలో త్వరితగతిన చర్యలు చేపడతామని వివరించారు. ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్, పరిష్కారమైన కేసులు, విచారణలో ఉన్న కేసుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ఎస్సీ వెల్పేర్ ఆఫీసర్ కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ రమేశ్, డీపీఓ వెంకయ్య, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి, రాంబాబు, నరేందర్, కృష్ణ, రామునాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణకు సహకరించాలి
ఓటరు జాబితా సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ 72.47 శాతం పూర్తయిందని తెలిపారు. పారదర్శకంగా, ఖచ్చితంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, జాబితాలను వెంటనే సమర్పించాలని సూచించారు.
అర్హులందరికీ బ్యాంకు రుణాలు
ఏటూరునాగారం: అర్హులందరికీ బ్యాంకు రుణాలను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ దివాకర బ్యాంకర్లను ఆదేశించారు. ఈ మేరకు ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల అధికారులతో బుధవారం కలెక్టర్ వివిధ ప్రభుత్వ పథకాల రుణాల పురోగతిపై సమీక్షించారు. వ్యవసాయం, విద్య, స్వయం ఉపాధి రంగాలకు బ్యాంకర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాప్యం లేకుండా అర్హులకు రుణాలు అందజేయాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు పరిశీలించి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీఓ వసంతరావు, ఎస్‌డీసీ ప్రతాప్, డీడీ జనార్దన్, ఎస్‌ఓ రాజ్‌కుమార్, వివిధ బ్యాంక్ అధికారులు, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మొక్కజొన్న విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు పలువురు నష్టపోయారని, వారిని పరిహారం ఇచ్చేందుకు పలు విత్తన కంపెనీలు ముందుకొచ్చినట్లు తుడుందెబ్బ మండల అధ్యక్షుడు నీలాద్రి తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను అగ్రికల్చర్, విత్తన కంపెనీల యజమానులు వచ్చి బుధవారం పరిశీలించారు. ఈ మేరకు రాశి సీడ్స్ కంపెనీ వారు పరిశీలించి పరిహారం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారని వివరించారు.
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఆర్‌ఐటీఐ కళాశాలలో ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో ఆడ్మిషన్లను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. నూతనంగా ఆరు రకాల కోర్సులను వినియోగంలోకి తీసుకొచ్చి నట్లు వెల్లడించారు.
బ్యారేజీ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్న రివర్ బోర్డు అధికారులు
కన్నాయిగూడెం: అడవుల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గోదావరి రివర్ బోర్డు చైర్మన్ బీపీ.పాండ్యా అన్నారు. మండల పరిధిలోని తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీని బుధవారం రివర్‌బోర్డు కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులు సందర్శించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బ్యారేజీ ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. బ్యారేజీ ప్రాంతం పరిసరాలను శుభ్రం చేయించారు. అనంతరం బ్యారేజీ పరిసరాల్లో పాండ్యా కమిటీ మెంబర్లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అడవుల పెంపకంతో స్వచ్ఛమైన గాలితో పాటు సమృద్ధిగా వర్షాలు పడుతాయని వివరించారు. అలాగే జీవకోటి మనుగడకు దోహదపడుతాయని తెలిపారు. అడవులు తరిగిపోతే మానవ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో బోర్డు మెంబర్లు సతీష్ కుమార్ కోంబోజ్, ఆర్‌ఎం రంగరాజన్, ఎస్‌ఈ రవికుమార్, ఈఈ వేణుగోపాల్, డీఈ ఎండీ.షర్మి ల, ఎస్‌ఈఈ సతీష్ బాబు పాల్గొన్నారు.
20 ఎకరాల్లో వివిధ రకాల మొక్కలు నాటేందుకు బ్లాక్‌ల కేటాయింపు
ఆయిల్‌పామ్ తోటల్లో అంతర్‌పంటగా పండ్ల మొక్కల పెంపకం
కలెక్టర్ టీఎస్.దివాకర
గోదావరి రివర్ బోర్డు చైర్మన్
బీపీ పాండ్యా


