రూ.40.98 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.40.98 కోట్లు

Mar 25 2026 6:58 AM | Updated on Mar 25 2026 6:58 AM

రూ.40.98 కోట్లు రైతులందరికీ పెట్టుబడి సాయం

మొదటి విడత రైతుల ఖాతాల్లో రైతు భరోసా

ములుగు: వ్యవసాయ భూమి ఉన్న ప్రతీ రైతుకు యాసంగి పంటల సాగు కోసం ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 86,736 మంది రైతులు 1,73,970 ఎకరాలు సాగు చేస్తుండగా రూ.104.38 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించాల్సి ఉంది. ప్రభుత్వం మొదటి విడతగా జిల్లాలోని 79,040 మంది రైతులకు గాను ఒక ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.40,98,59,892 కోట్లు ఖాతాల్లో జమ చేసింది. రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా ప్రభుత్వం ఈసారి తొలుత ప్రతీ రైతుకు ఒక ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి సాయాన్ని అందించింది.

అన్నదాతల్లో గందరగోళం

రబీ పంటల సాగు ప్రారంభమై రెండు నెలలు దాటినప్పటికీ ప్రభుత్వం ఆలస్యంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వం ఒక ఎకరానికి మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించడంతో అన్నదాతల్లో గందరగోళం నెలకొంది. గతంలో ఒక ఒకరం భూమి ఉన్న రైతులకు మొదటగా, రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతులకు తర్వాత, నాలుగు, ఐదు ఎకరాలు ఉన్న రైతులకు క్రమపద్ధతిలో పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసేది. కాని ఈసారి రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఎకరానికి మాత్రమే రైతు భరోసా డబ్బులను ఖాతాల్లో జమచేయడంతో మిగతా భూమికి పెట్టుబడి సాయం వస్తుందో లేదొనని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడి సాయంపై స్పష్టత కరువు

ప్రభుత్వం రైతుభరోసా కింద అందిస్తున్న పెట్టుబడి సాయంపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మొదటి విడతగా ఎన్ని ఎకరాలకు, రెండో విడతలో ఎన్ని ఎకరాల వరకు, మూడో విడతలో మొత్తం ఎకరాలకు పెట్టుబడి సాయం వస్తుందా అని రైతులు వ్యవసాయ అధికారులను అడుగుతున్నప్పటికీ తమకు ఎలాంటి ఆదేశాలు లేవని చెబుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. రెండో విడత పెట్టుబడి సాయం ఏప్రిల్‌ 5 నుంచి, మూడో విడత ఏప్రిల్‌ 25 నుంచి రైతు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ, ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతుందో అధికారులు స్పష్టత ఇవ్వకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఏప్రిల్‌ చివరి వరకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. మొదటి విడతలో ఎకరం వరకు 79,040 మంది రైతులకు రూ.40.98 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి, ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి రెండో విడత డబ్బులు, ఏప్రిల్‌ 25 నుంచి మూడో విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఏఫ్రిల్‌ 30వ తేదీలోగా పంటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది.

– సురేశ్‌ కుమార్‌, డీఏఓ

రెండు, మూడో విడతలపై కానరాని స్పష్టత

ఎకరం భూమికే అందిన పెట్టుబడి సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement