ములుగు/ ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలనకు పాటుపడాలని, లక్షణాలను ముందుగా గుర్తిస్తే నయం చేయవచ్చని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ములుగులోని ఏరియా ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన ప్రపంచ –క్షయవ్యాధి దినోత్సవం, ‘క్షయ వ్యాధి –ముక్తుభారత్’ రెండో విడత ప్రారంభం సందర్భంగా మంగళవారం చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో క్షయవ్యాధి నిర్ధారణ, వ్యాధి అరికట్టే చర్యలు, వ్యాధి చికిత్సపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులును ఆదేశించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు మాట్లాడుతూ టీబీ వ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందన్నారు. టీబీ ముక్తు భారత్ రెండో విడత వందరోజుల కార్యక్రమంలో 14ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీబీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా కోఆర్డినేటర్ ఫర్ సర్వీసెస్ జగదీశ్వర్, జిల్లా ప్రోగాం అధికారులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొనసాగుతున్న నిర్మాణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే కలెక్టర్ నవజాత శిశువులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించి జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై సంబంధిత శాఖలు సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు.
ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
గోవిందరావుపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు పూర్తైన ఇళ్లను గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సరీని, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఇళ్ల పనులు పూర్తి అయినంత వరకు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయా అంటూ ఆరా తీశారు. నర్సరీల్లో పెంచే మొక్కలను వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సూర్యనారయణ, ఎంపీఓ మమత, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. అలాగే ల్యాబ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్, అనూష, లక్ష్మీ, శ్యామల, జంపయ్య, నీరజ, శివాని, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


