పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
ములుగు రూరల్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థను శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంట కార్మికులకు రావాల్సిన అల్పాహారం, కోడిగుడ్లు, వంట బిల్లులతో పాటు 9 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే వాటిని విడుదల చేయాలన్నారు. ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమ, రాజకుమారి, ప్రమీల, పద్మ, రాధ, కమల, శోభ, భారతి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
శివాలయంలో
ఏఎస్పీ పూజలు
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ శివం ఉపాధ్యాయ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి కార్తీక మాసం కావడంతో ఏఎస్పీ దంపతులు వచ్చి అకాశ దీపాన్ని వెలిగించి ఆలయంలో కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయంలో శివలింగాకారంలోని జ్యోతులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మడుగూరి ప్రసాద్, సాయిబాబా ఆలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పాయం కోటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర ట్రస్టుబోర్డు కమిటీని నియమించకుండా తాత్కాలిక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ సారి జాతరకై నా ప్రభుత్వం స్పందించి ట్రస్టుబోర్డు కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. జాతరలో అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించే ఆదాయాన్ని దేవాదాయశాఖ తీసుకుని ఆదివాసీ ప్రజలను, పూజారులను విస్మరిస్తుందన్నారు. ఈ సమావేశంలో గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దబోయిన రవి, నాయకులు పూర్ణ, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పుల జగన్నాధరావు, మహిళ జాక్ చైర్మన్ శమంతకమణి, మాల్కం రాధిక, మండల అధ్యక్షులు మోకాళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక తరలింపు అడ్డగింత
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని ఊరట్టం తూములవాగు నుంచి మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులకు తరలిస్తున్న ఇసుకను ఊరట్టం గ్రామస్తులు శనివారం అడ్డుకున్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ ప్రహరీ నిర్మాణానికి తూముల వాగు నుంచి ఇసుక తీసుకువచ్చి వినియోగించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ, పెసా తీర్మానం లేకుండా ఇసుక నేరుగా జేసీబీతో లారీల్లో ఇసుక లోడింగ్ చేసి తరలిస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అమ్మవార్ల అభివృద్ధి పనులకు ఇసుక తరలింపునకు అభ్యంతరం లేదని పెసా తీర్మానం చేసి కూలీలతో ట్రాక్టర్ల ద్వారా ఇసుక బయట డంపు చేసి లారీల్లో తీసుకెళ్లాలని గ్రామస్తులు తెలిపారు. పగలే కాకుండా రాత్రి వేళలో కూడా వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులకు మేడారం పరిసరాల్లో ఉచితంగా ఇసుక లభించడంతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ఇసుక తరలించి ఇతర ప్రాంతాల్లో డంపు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి


