సైబర్ మోసాలపై అప్రమత్తం
● ఎస్పీ డాక్టర్ శబరీశ్
ములుగు: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ శబరీశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వ్యాపార సముదాయాలు, ప్రైవేట్ ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల నిర్వాహకులకు అనుమానిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తే భయాందోళనకు గురికావద్దని సూచించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని లేదా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఇటీవల జిల్లాలోని ఒక మెడికల్ షాప్ యజమానికి సైబర్ మోసగాళ్లు కాల్ చేసి తమని తాము డ్రగ్ ఇన్‌స్పెక్టర్లుగా పరిచయం చేసుకొని అట్టి మెడికల్ షాపులో అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని షాపు యజమానిని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.


