అభివృద్ధి పనులు పకడ్బందీగా చేపట్టాలి
కన్నాయిగూడెం: మండల పరిధిలో కేంద్రం ప్రభుత్వం చేపట్టిన పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ డిప్యూటీ సెక్రటరీ డైరెక్టరేట్ జనరల్ అన్వేష్‌కుమార్ అన్నారు. ఈ మేరకు మండలంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఆకాంక్షిత ఆస్పీరేషనల్ బ్లాక్ ద్వారా చేపట్టిన పనులను ఆయన గురువారం జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. మండల పరిధిలోని కంతనపల్లిలో ఉదయం పర్యటించి అక్కడ చేపట్టిన 40 సూచికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. అలాగే వైద్య, పంచాయతీ, రెవెన్యూ, మహిళా సంఘాలు, మిషన్ భగీరథ, వివిధ శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ప్రభుత్వం పైలెట్‌గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం బంగారుపల్లిలో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు. అనంతరం సబ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేయగా వాటి తయారీ విధానం, ఆర్థికంగా ఉపయోగం పడుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్యం, ఆస్పీరేషనల్ బ్లాక్ ద్వారా చేపడుతున్న ఆరోగ్య సూచికల అమలు గురించి డాక్టర్ అభినవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం ద్వారా చేపట్టే కార్యక్రమాలను వందశాతం అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా హైబీపీ, బరువు తక్కువగా జన్మిస్తున్న పిల్లలకు తల్లులు పోషక పదార్థాలు అందించాలని తెలిపారు. అనంతరం ముప్పనపల్లిలో ఉన్న కేజీబీవీని సందర్శించి బీహెచ్‌ఈఎల్ వారి ఆర్థిక నిధులతో అందించిన డిజిటల్ ప్రొజెక్టర్‌ను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ చదువుపై దృష్టి సారించాలన్నారు. అలాగే దేవాదుల ఎత్తిపోతలు, సమ్మక్క బ్యారేజీని సందర్శించి పలు అంశాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, లోకల్ బాడీ, ఆస్పీరేషనల్ బ్లాక్ కన్సల్టెంట్ అడ్డాల, ఏపీడీ వెంకటనారాయణ పాల్గొన్నారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ డిప్యూటీ
సెక్రటరీ డైరెక్టరేట్ జనరల్ అన్వేష్‌కుమార్
అభివృద్ధి పనులు పకడ్బందీగా చేపట్టాలి


