
విజృంభిస్తున్న విషజ్వరాలు
జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు
ములుగు రూరల్: ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతోంది. వందల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్యులు ఓపీ సేవలు అందిస్తున్నారు. ఓపీ చిట్టీలు పొందేందుకు కూడా రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జ్వర బాధితులను పరీక్షించిన వైద్యులు నిర్ధారణ పరీక్షలు రాసి రిపోర్టులు వచ్చాక కలవాలని సూచిస్తున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలకు ఒక రోజు సమయం పడుతుండడంతో రెండోరోజు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. జ్వర పీడితులను అడ్మిట్ చేసుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన సీజనల్ వ్యాధుల అవగాహన సదస్సులు మొక్కుబడిగా సాగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి..
జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వారం రోజుల్లో ఔట్ పేషెంట్లు 2,340 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించారు. ఇందులో అత్యధికంగా జ్వర పీడితులు 1,017 మందికి చికిత్స అందించారు. ఆస్పత్రిలో 295 మంది రోగులను అడ్మిట్ చేసుకొని వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో రోజురోజుకూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఇందులో అత్యధికంగా వైరల్ ఫీవర్‌తోనే రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయి.
రోగులతో కిటకిటలాడుతున్న
ఏరియా ఆస్పత్రి
వారం రోజుల్లో 2,340 మందికి
ఓపీ సేవలు
నిర్ధారణ రిపోర్టుల ఆలస్యం
ఇబ్బందులు పడుతున్న రోగులు

విజృంభిస్తున్న విషజ్వరాలు

విజృంభిస్తున్న విషజ్వరాలు