
పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును ప్రైవేట్ పరం చేయడాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 వేలు వేతనం అందించాలన్నారు. కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలన్నారు. స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలన్నారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ముత్యాల రాజు, ఇంజం కొమురయ్య, బోడ రమేష్, సదయ్య, వినోద్, రాధ, రాజేందర్, సమ్మయ్య, నరేష్, రాజు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.