
బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలి
ఏటూరునాగారం: బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించాలని సీడీపీఓ ప్రేమలత, డాక్టర్ సుమలత అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిలో పోషణ మాసోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం, తల్లిపాలు, వ్యక్తిగత శుభ్రతపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీపీఓ ప్రేమలత, రొయ్యూరు వైద్యురాలు సుమలత మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు పిల్లలకు మంచినీరు తాగించాలన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. శిశువు పుట్టిన మొదటి 30 నుంచి 60 నిమిషాలు వెంటనే తల్లిపాలు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆరు నెలల్లోపు వయస్సు ఉన్న పిల్లలను గృహ సందర్శన కార్యక్రమం చేపట్టి వారిని గుర్తించి అంగన్‌వాడీ బడిలో చేర్పించాలన్నారు. అలాగే పోషక విలువలు ఉన్న ఆకు కూరలు, కోడిగుడ్లు, పాలు, పప్పు దినుస్సులను తినిపించాలని సూచించారు. ఇదేకాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పాలు, కోడిగుడ్డు, బాలామృతం ప్లస్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ కల్పన, సూపర్‌వైజర్లు శ్రీవిద్య, వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
సీడీపీఓ ప్రేమలత