
డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
● సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్
ఏటూరునాగారం: డైలీవేజ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐటీడీఏ ఎదుట 23 రోజులుగా సమ్మె చేస్తున్న వర్కర్లకు ఆయన శనివారం సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. దసరా సెలవులకు ముందు అనేక హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులతో వంటలు చేయించారని తెలిపారు. అదే మళ్లీ కొనసాగితే పిల్లలతో పాటు వారి కుటుంబ సభ్యులను సమీకరించడంతో పాటు సీఐటీయూ, ప్రజా, విద్యార్థి, యువజన సంఘాల సభ్యులందరినీ సమీకరించి ఐటీడీఏ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎనిమిది నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వస్తున్న వేతనాలను తగ్గిస్తూ జీవో నంబర్ 64ను తీసుకురావడం దారుణమన్నారు. పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ టైం స్కేల్ అమలయ్యే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వర్కర్లు నాగలక్ష్మి, గొంది లక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, జి.సత్యం. ఊకే సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు పాల్గొన్నారు.