14 ఏళ్లుగా ప్రత్యేకమే..! | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్లుగా ప్రత్యేకమే..!

Oct 4 2025 2:18 AM | Updated on Oct 4 2025 2:18 AM

14 ఏళ్లుగా ప్రత్యేకమే..!

14 ఏళ్లుగా ప్రత్యేకమే..!

ములుగు: క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క

ములుగు: జమ్మి(శమీ)పూజలో పాల్గొన్న ప్రజలు

మంగపేట: గిరిజనులు.. గిరిజనేతరుల నడుమ మొదలైన పంచాయతీ.. మంగపేట మండల అభివృద్ధికి అంతరాయంగా మారింది. 14 ఏళ్లుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాసమస్యలను పట్టించుకునేవారు లేకుండాపోయారు. మంగపేట మండలం ఏజెన్సీ పరిధిలోకి వస్తుందని ఆదివాసీ గిరిజనులు, కాదని గిరిజనేతరుల మధ్య నెలకొన్న వివాదం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో 2011 నుంచి సర్పంచ్‌ ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే 2023 జూలై 05న మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్డు ఏరియా పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పు వెలురించారు. ఈమేరకు రాష్ట్రంలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు మండలంలో కూడా ఎన్నికలు జరుగుతాయని ప్రజలు భావించారు. కానీ, హైకోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో మండలంలో మళ్లీ ఎన్నికలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాధనం అవినీతిమయం

మండలంలో సర్పంచ్‌ ఎన్నికలు నిలిచిపోవడంతో 25 గ్రామ పంచాయతీల పరిపాలన 14 ఏళ్లుగా ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఆయా పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చిన కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతికి పాల్పడిన అధికారులు సస్పెండ్‌ అయినా.. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండతో.. అవినీతికి పాల్పడిన సొమ్మును తిరిగి చెల్లించకుండానే విధుల్లోకి చేరడం మండలంలో పరిపాటిగా మారింది. గడిచిన 14 ఏళ్ల ప్రత్యేకధికారుల పాలనలో కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట తదితర పంచాయతీల కార్యదర్శులు మొదలుకుని కొందరు మండల స్థాయి అధికారులు రూ.3 కోట్లకు పైగా పంచాయతీ నిధులను కాజేశారు. మరో రూ.4 కోట్లకు పైగా పనులు చేయకుండానే చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి కాజేసినట్లు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి.

జెడ్పీటీసీ ఎన్నికలు యథాతథం

మండంలో సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికలు నిలిచిపోయినా జెడ్పీటీసీ ఎన్నిలు యథాతథంగా జరుగుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నవంబర్‌లో జరుగనున్న జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మండంలో కూడా ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈనెల 10న జెడ్పీటీసీ స్థానాలకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను నిర్ణయించగా.. మంగపేట జెడ్పీటీసీ స్థానం జనరల్‌(మహిళ)కు రిజర్వ్‌ అయిన విషయం తెలిసిందే. అసలే ప్రజా ప్రతినిధులు లేక ప్రజాసమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని.. కనీసం జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా సమస్యలను ప్రభుత్వం, కలెక్టర్‌ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. సుప్రీం పరిధిలో ఉన్న గిరిజన, గిరిజనేతరుల పంచాయతీ త్వరగా పరిష్కారమై పంచాయతీ ఎన్నికలు జరిగితేనే తమ సమస్యలు తీరుతాయని, అభివృద్ధి జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు.

మంగపేటలో మళ్లీ ఎన్నికలు ఎప్పుడో..?

ఏళ్ల తరబడి స్థానిక ఎన్నికలు

నిర్వహించని వైనం

హైకోర్టు తీర్పుతో ప్రజల్లో ఆశలు

సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అసహనం

కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం

కుంటుపడుతున్న మండల అభివృద్ధి

సమస్యలతో ప్రజల సతమతం

మండంలోని 25 గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేకపోవడం, పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగం కావడంతో మండలంలోని గ్రామాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా తయారైంది. పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రావడంలేదని, కనీసం తమకు జీతాలే రావడం లేదని పంచాయతీ కార్యదర్శులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. అదనపు బాధ్యతలు తమకు భారంగా మారాయనే కారణంతో ప్రత్యేకాధికారులు.. పంచాయతీలను పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement