
సనాతన ధర్మమే శాశ్వతం
● మూలాలు మర్చిపోతే భవిష్యత్ ఉండదు
● ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భగవద్గీత ప్రచారకుడు రాధా మనోహర్‌దాస్ స్వామీజీ
ములుగు: భారతీయ మూలాలను మర్చిపోతే భవిష్యత్ ఉండదని, యుగాలు మారినా సనాతన ధర్మమే శాశ్వతమని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, భగవద్గీత ప్రచారకుడు శ్రీరాధా మనోహర్‌దాస్ స్వామీజీ అన్నారు. జిల్లా కేంద్రంలో విజయదశమిని పురస్కరించుకొని ధర్మజాగరణ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్తగా హాజరైన రాధామనోహర్ స్వామీజీ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం, తప్పుపై ఒప్పు విజయం సాధించిందన్నారు. సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ, విజయదశమి లాంటి పండుగలు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం యువత పాటుపడాలని, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసేవారిని వదిలేదిలేదన్నారు. ప్రతీ ఒక్కరూ శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్మాత్మిక, సామాజిక, రాజకీయ ఎదుగుదల సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో దసరా సందర్భంగా నిర్వహించిన రావణాసురవధ ఆకట్టుకుందని, పండుగపూట ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేలాదిమంది కుటుంబాలను ఒకేచోట చేర్చి పండుగ జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. మంచి కోసం చేసే ప్రతీ పనిలో తాను పాలుపంచుకుంటానని వెల్లడించారు. అనంతరం శ్రీ రాధామనోహర్ దాస్ స్వామీజీ, సీనియర్ సివిల్ జడ్జితోపాటు పలువురు ప్రముఖులు రావణసుర ప్రతిబకు నిప్పంటించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు ఆకర్షించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కన్నోజు సునీల్, చెలుమల్ల రాజేందర్, సుంకరి రవీందర్, గంగిశెట్టి శ్రీనివాస్, పెట్టెం రాజు, ఇమ్మడి రమేష్, వాంకుడోతు జ్యోతి, కర్ర రాజేందర్ రెడ్డి, కొత్తపల్లి బాబురావు, కొమరవెళ్లి హరినాథ్, గండ్రకోట రవీందర్, సానికొమ్ము వినీత్ రెడ్డి, తోకల నందన్, పెట్టెం రాజేందర్, ఎలగందుల మోహన్, రుద్రోజు ఆనందాచారి, రాము, సిరికొండ వెంకన్న, నల్లా దిలీప్, గౌతం, ఏర్ల వెంకన్న, బానోతు సందీప్, కొండి రవీందర్, బద్ధం సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.