
గాంధీ విగ్రహానికి కార్మికుల వినతి
● రోడ్డుపైన దసరా పండుగ చేసుకున్న డైలీ వైజ్ వర్కర్స్
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకుంది. నిరసనలో భాగంగా కార్మికులు .. ఎంపీడీఓ ఆఫీస్ నుంచి బొడ్రాయి ప్రాంతంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి గాంధీ విగ్రహానికి పూలదండ వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ మాట్లాడుతూ.. గాంధీ అహింసా సిద్ధాంతం మేరకు శాంతియుతంగా 22రోజులుగా సమ్మె చేస్తూ నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు 22 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని కోరారు. ఓ పక్క గత ఎనిమిది నెలల నుంచి జీతాలు లేక కుటుంబం గడవక తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే మరోపక్క వేతనాలను తగ్గిస్తూ జీఓ 64ను తీసుకురావడం దుర్మార్గమని అన్నారు. అర్హులైన అందరికీ టైం స్కేల్ ప్రకారం అమలు అయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో చిటమట రమేష్, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, జయలక్ష్మి, సత్యం, సమ్మక్క, కమల, విజయలక్ష్మి, రాజు, సమ్మయ్య, సూర్యతేజ, ఇందిర, సుమలత, సాంబయ్య, శివకృష్ణ, సత్యం పాల్గొన్నారు.