ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించారు. శనివారం సమ్మక్క– సారలమ్మ గద్దెల చుట్టూ ప్రహరీ(సాలహారం) నిర్మాణ పనులను చేపట్టేందుకు చెట్లను, పిచ్చి మొక్కలను జేసీబీతో తొలగించి శుభ్రం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రహరీని అలాగే ఉంచి నూతనంగా నిర్మించిన అనంతరం పాత ప్రహరీని తొలగించనున్నారు. రాతితో ప్రహరీ నిర్మాణం పనులు మొదలు కానున్నాయి.
రేపటి ప్రజావాణి రద్దు
ములుగు రూరల్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రేపు(సోమవారం) నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని వివరించారు. అర్జిదారులు ఈ విషయం గమనించాలని వెల్లడించారు. ప్రజలు సహకరించాలని కోరారు.
భారీ వర్షం
వాజేడు: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సుమారుగా రెండు గంటల పాటు వర్షం పడింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. తుపాను ప్రభావంతో ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. పొట్ట దశలో ఉన్న వరి పంటలకు ఈ వర్షం బాగా ఉపయోగ పడుతుందని రైతులు తెలిపారు. వర్షం పడిన సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బీరెల్లి, నర్సాపూర్, కాటాపూర్ ఎంపీటీసీ క్లస్టర్ పరిధిలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి సీతక్క జిల్లాలో వందల కోట్ల నిధులతో సీసీ రోడ్లు, రహదారులు, బ్రిడ్జి నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేదల కల సాకారం చేసిన ఘనత మంత్రి సీతక్కకే దక్కుతుందన్నారు. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్‌గౌడ్, గౌరవ మండల అధ్యక్షుడు జాలపు అనంత రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఇప్ప నాగేశ్వర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఎండీ.ముజఫర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచులు మంకిడి నరసింహస్వామి, ఇర్ప సునీల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడి సతీష్ సీనియర్ నాయకులు తిరుపతి, రామస్వామి పాల్గొన్నారు.
ప్రయాణికులకు
సౌకర్యాలు కల్పించాలి
హన్మకొండ: ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్‌లో వరంగల్ రీజియన్ బస్సులు నిలిచే బస్ పాయింట్‌ను శనివారం ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, వెంకన్న, చీఫ్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభానుతో కలిసి ఎండీ వై.నాగిరెడ్డి సందర్శించారు. ప్రయాణికులు కూర్చోవడానికి స్థలం, బస్సులు నిలుపు స్థలం, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. వీటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఆలయ నిర్మాణ పనులు షురూ..