
సద్దులకు సిద్ధం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె): జిల్లాలో ఆడపడుచులు సద్దుల బతుకమ్మ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో నేడు(సోమవారం) జరుపుకోనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో రేపు(మంగళవారం) వేడుకలు నిర్వహించుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లోని వేద పండితుల నిర్ణయం ప్రకారం రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ ఆట స్థలాల వద్ద అధికారులు విద్యుత్ దీపాల ఏర్పాటు, డీజే సౌండ్స్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ మేరకు మహిళలు నూతన వస్త్రాలు, పూల కొనుగోళ్లతో పాటు కంగన్‌హాల్ సామగ్రి కొనుగోళ్లపై దృష్టి సారించారు.
పూలకు ఫుల్ డిమాండ్
పండుగ నేపథ్యంలో బంతి పూలను డిమాండ్ పెరిగింది. కిలో బంతిపూలను పలు చోట్ల రూ.100కు విక్రయించారు. అలాగే వెంకటాపురం(కె) మండల కేంద్రంలో రూ.150 నుంచి రూ.200వరకు విక్రయించారు. చామంతి పూలు కేజీ రూ.400వరకు ధర పలికింది. ఇవేకాకుండా గునుగు, తంగేడు, టేకు, సీతజడ పూలను సైతం మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించడం గమనార్హం. పిండి వంటలను తయారు చేసేందుకు, పల్లీలపొడి, నువ్వులు, కొబ్బరి, సత్తుపిండి తయారీకి మహిళలు కిరాణం షాపుల వద్ద కొనుగోలు చేసేందుకు కిక్కిరిసిపోయారు.
నిర్వాహకులకు పోలీసుల సూచనలు
ఏటూరునాగారంలోని రామాలయం, బొడ్రాయి, బస్టాండ్, సాయిబాబా, స్టార్‌యూత్ శివాలయం తదితర ప్రాంతాల్లోని ఆట స్థలాలను పోలీసులు పరిశీలించారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలో తోపుకుంట, ఏటూరునాగారంలో జంపన్నవాగు, గోదావరితో పాటు ఆయా మండలాల్లోని చెరువులు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు. ఈ మేరకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో నేడు, రేపు బతుకమ్మ సంబురాలు
జోరుగా గునుగు, తంగేడు, టేకు తదితర పూల విక్రయాలు
షాపులు, పూల కొనుగోళ్ల వద్ద మహిళల సందడి

సద్దులకు సిద్ధం

సద్దులకు సిద్ధం