
సంపూర్ణ పౌష్టికాహారమే లక్ష్యం
● అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు
● కూరగాయలు, ఆకుకూరల సాగు
కాటారం: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం దిశగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులుగా ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు కేంద్రాల్లోనే పోషకాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పండించేలా కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేయనుంది. ఉద్యాన శాఖ ద్వారా గతంలో ఎంపిక చేసిన అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు మరికొన్ని కొత్త కేంద్రాల్లో కిచెన్‌గార్డెన్‌లను ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. రసాయన ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇలా పండించిన కూరగాయలు, ఆకుకూరలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పెట్టనున్నారు.
643 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు ఉండగా 643 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 50 అంగన్‌వాడీ కేంద్రాలు కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటుకు ఎంపిక కాగా గతేడాది కొన్ని కేంద్రాల్లో, ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు చేశారు. కిచెన్‌గార్డెన్‌లలో గత సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల మొక్కలు, ఆకుకూరల విత్తనాలు నాటి పందిర్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, ఆయాలకు అప్పగించారు. కిచెన్‌గార్డెన్‌లలో వంకాయ, బెండకాయ, టమాట, సోరకాయ, పాలకూర, తోటకూర, మెంతికూర, కోత్తిమీర లాంటి పోషకాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లోని కిచెన్‌గార్డెన్‌లలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు కాపునకు రాగా వాటిని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వండి పెడుతున్నారు. మరికొన్ని కేంద్రాల్లో గత నెలలో కూరగాయలు, ఆకుకూరల సాగు ప్రారంభించారు.
ఒక్కో కేంద్రానికి రూ.10 వేలు..
కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటుకు ఎంపికై న ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. ఈ నిధులను విత్తనాల కొనుగోలు, కుండీలు, మట్టి, ఇతర పనిముట్లు కొనుగోలు చేయడానికి వెచ్చించాల్సి ఉంటుంది. నారు పెట్టేందుకు రూ.3వేలు, రవాణా ఖర్చులకు రూ.వెయ్యి, విత్తనాలు నాటేందుకు, భూమి సిద్ధం చేసే ఖర్చులకు రూ.వెయ్యి, పంట నిర్వహణ, నీటి వసతుల కల్పన కోసం రూ.5వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.10వేలతోనే ఐదేళ్ల పాటు నిర్వహణ కొనసాగించాల్సి ఉంటుంది.
కిచెన్ గారెన్లపై ప్రత్యేక దృష్టి..
అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు భోజనంలో అందించాలనే లక్ష్యంతో కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు చేశాం. వీలైనన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉన్న విత్తనాలు, కూరగాయల మొక్కలు నాటేలా చూస్తున్నాం.
– రాధిక, సీడీపీఓ, మహదేవపూర్ ప్రాజెక్ట్
జిల్లా వివరాలు..
మండలాలు 12
ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు 02
(భూపాలపల్లి, మహదేవపూర్)
అంగన్‌వాడీ కేంద్రాలు 643
కిచెన్‌గార్డెన్‌ల ఏర్పాటుకు
ఎంపికై న కేంద్రాలు 50

సంపూర్ణ పౌష్టికాహారమే లక్ష్యం