
శరవేగంగా అభివృద్ధి పనులు
ములుగు రూరల్: నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.4 కోట్లు ఖర్చుచేసి సెంట్రల్ లైటింగ్‌తో నిర్మించిన సీసీ రోడ్డును ఆదివారం మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు పట్టణంలోని ప్రతీ రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తామని తెలిపారు. ఇటీవల ములుగు ప్రభుత్వ ఆస్పత్రి రహదారి నుంచి తోపుకుంట చెరువు వరకు రూ.4 కోట్లతో సెంట్రల్ లైటింగ్‌తో సీసీ రోడ్డు నిర్మించినట్లు వెల్లడించారు. అదే విధంగా రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుటుంబ సంక్షేమ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. 010 పద్దు ద్వారా జీతాలు, కారుణ్య నియామకాల జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, యూటీఎఫ్ నాయకులు చావ రవి, వెంకట్, రాజశేఖర్ రెడ్డి, కొండయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క