
ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్
● డీఎస్పీ సూర్యనారాయణ
మల్హర్: ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నామని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని కొయ్యూరు గ్రామంలో సాయంత్రం పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 సివిల్ కానిస్టేబుళ్లు, 20 టీజీఎస్పీ కానిస్టేబుళ్లతో కలిసి ఇళ్లలో తనిఖీలు చేశారు. దీంట్లో భాగంగా నంబర్ ప్లేట్‌లేని 7 వాహనాలు, వాహన పత్రాలు సరిగా లేని 25 వాహనాలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. గుడుంబా, గంజాయి వంటి చెడు వ్యసనాలు, సీసీ కెమెరాలు, డయల్ 100పై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ దసరా పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్సై నరేష్, రాజన్, కాటారం ఎస్సై శ్రీనివాస్, మానస, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.