
సౌరశక్తి వినియోగంపై అవగాహన
గోవిందరావుపేట: జిల్లాలో చల్వాయి, పస్రా, గోవిందరావుపేట, వెంకటాపూర్ గ్రామపంచాయితీ కార్యాలయాల్లో గురువారం ఆయా సంబంధిత పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్‌పై ప్రత్యేక ప్రచార కార్యక్రమం, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఆర్‌ఈడీసీఓ జిల్లా అధికారి రాజేందర్, ఎన్‌పీడీసీఎల్ సబ్ ఇంజనీర్ అఖిల, ఫీల్డ్ ఆఫీసర్ నవీన్ హాజరై మాట్లాడారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ములుగు, గోవిందరావుపేట, చల్వాయి, పస్రా, వెంకటాపూర్, ఏటూరునాగారం, కమలాపూర్, వెంకటాపురం గ్రామాలను మోడల్ విలేజ్‌గా ఎంపికచేశామన్నారు. ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం రూ.కోటి వరకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు మోడల్ సోలార్ విలేజ్ స్కీం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.