
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
మద్దతు ధర రూ.8,110
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు
ములుగు రూరల్: రైతులు సాగు చేసిన పత్తి పంట కొనుగోలుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు వేబ్రిడ్జీ లు, కంప్యూటర్‌లు, ఇతర వసతులను పరిశీలించారు. జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలను గుర్తించి సీసీఐకి నివేదికలు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కోనుగోలుకు కపాస్ కిసాన్ యాప్‌ను తీసుకువచ్చింది. పత్తి పంట అమ్మకం సమయంలో రైతులు ఈ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో నిర్ధేశిత సమయంలో పంట అమ్మకానికి రైతులకు కేటాయించడం జరుగుతుంది. సమయానుసారంగా రైతులు పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకం చేసుకోవచ్చు. దీంతో పాటు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంట నమోదు ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో 20,480 ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలోని పది మండలాల్లో 20,480 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పత్తి దిగుబడి అంచనా 1.90 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్, శ్రీ సాయిలక్ష్మీ ఇండస్ట్రీస్, రాజరాజేశ్వర కాటన్ ఇండస్ట్రీస్‌లను ఎంపిక చేశారు. మార్కెట్ పరిధిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలను గుర్తించారు.
కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర తేమ నిబంధనల మేరకు రూ.8,110 ప్రకటించింది. 8 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తోంది. అంత కంటే ఎక్కువ శాతం తేమ ఉంటే 1 శాతం ఎక్కువ ఉంటే మద్దతు ధర నుంచి రూ.81.10 పైసలు ధర తగ్గించి కొనుగోలు చేస్తారు. రైతులు నిబంధనల మేరకు పత్తి పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందవచ్చు.
20,480 ఎకరాల్లో పత్తిసాగు
1.90 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా
కొనుగోళ్లకు ప్రత్యేక యాప్
క్వింటాకు మద్దతు ధర రూ.8,110
పత్తి సాగు చేసిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నిబంధనల మేరకు పత్తి అమ్మకాలు చేపట్టి మద్దతు ధర పొందాలి. కపాస్ కిసాన్ యాప్‌తో రైతులకు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వారికి కేటాయించిన సమయంలో అమ్మకం చేసుకోవచ్చు.
– సోనియా, ములుగు మార్కెట్ కమిటీ కార్యదర్శి