
వదలని ముసురు
ఈదురుగాలుల బీభత్సంతో
నేలకొరిగిన చెట్లు
ములుగు: జిల్లాను ముసురు వదలడం లేదు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. ఏటూరునాగారం మండలంలో అత్యధికంగా 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గోవిందరావుపేట మండలంలో అత్యల్పంగా 19.0 మీల్లిమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని వాజేడు మండలంలో గోదావరి పొంగి ప్రవహిస్తుండడంతో తెలంగాణ బార్డర్ టేకులగూడెం దగ్గర జాతీయ రహదారి మునిగిపోవడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. వాజేడు–గుమ్మడిదొడ్డి, పేరూరు– కృష్ణాపురం మధ్య భారీవర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదతో మిర్చిపంటలు మునిగిపోయాయి. వెంకటాపురం(కె) మండల కేంద్రంలో బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు విరిగి రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. గురువారం ఉదయం రహదారిని క్లియర్ చేయగా రాకపోకలు కొనసాగాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలంలో తుమ్మల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గోవిందరావుపేట, వెంకటాపురం(ఎం) మండలాల్లో భారీవర్షానికి పలుసార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న గోదావరి
వాజేడు: వాజేడు మండలంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 15.370 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద పెరగడంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చి తో టలను వరద నీరు ముంచెత్తింది.
రెండు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
పొంగి ప్రవహిస్తున్న వాగులు,
విద్యుత్ సరఫరాలో అంతరాయం