
పేదల కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం
కాటారం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి గురువారం మంజూరుపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక, తక్కువ ధరకు సిమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, రాష్ట్రంలో అసమర్థ పాలన సాగించిందని మంత్రి విమర్శించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ తదితర పథకాలను అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ఇతరులు ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే పోలీసు కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగకుండా ఎంపీడీఓలు, గృహ నిర్మాణశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని, ఇళ్ల నిర్మాణం ఆగిపోతే అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తామని హెచ్చరించారు. అనంతరం అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణులకు సీమంతం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, సీఎంరిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండ్రు రమేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల నుంచి
డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు