
పట్టు తప్పుతున్న పాలన
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పాలన పట్టు తప్పుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల, పాలకవర్గాల ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అంతటా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిపోయి రెండేళ్లు కావొస్తోంది. అలాగే 8 నెలల క్రితం మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం కూడా పూర్తి కావడంతో అంతా ప్రత్యేకాధికారులతోనే పాలనను నెట్టుకొస్తున్నారు. అసలే శాఖాపరమైన బాధ్యతలతో సతమతమయ్యే అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలో ఏ శాఖలో చూసినా అధికారులు బిజీబిజీగానే కనిపిస్తున్నారు. దీంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్‌చార్జ్ అధికారులకే మళ్లీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా సర్వే పనులు, సంక్షేమ పథకాల అమలు పనుల్లోనే అధికారులు నిమగ్నమవుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు కనిపించడం లేదంటున్నారు. పర్యవేక్షణ కొరపడడంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే లెక్కగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలో పలు ప్రధాన శాఖలను ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకు రావడంతో పాలన పట్టుతప్పే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పరిస్థితులతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అధికారుల ఉరుకులు పరుగులు..
ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపడుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్‌బెడ్‌రూం లాంటి పథకాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన సర్వే, లబ్ధిదారుల ఎంపిక జాబితాలు తప్పుల తడకగానే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అదనపు విధులతో అధికారులపై ఒత్తిడి పెరిగి పోవడంతోనే ప్రభుత్వానికి సరైన నివేదికలు అందడం లేదని తెలుస్తోంది. అలాగే గడువులోగా వివిధ రకాల నివేదికలను అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
అధికారుల సతమతం..
ప్రత్యేక పాలన కొనసాగడంతో కొన్ని శాఖల జిల్లా అధికారులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు. గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు జెడ్పీ సీఈఓ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు), మున్సిపాలిటీ, ప్రత్యేక అధికారిగా, మండల ప్రత్యేక అధికారిగా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మైనార్టీ, ఎస్సీ వెల్ఫేర్ శాఖలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. 17 శాఖల్లో ఇన్‌చార్జ్ అధికారులకు ఇన్‌చార్జ్ విధులను అప్పగించడంతో ఏశాఖలోనూ పూర్తిస్థాయిలో పనిచేసిన పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. జిల్లా మార్కెటింగ్, టీజీఎంఐడీసీ, ఎకై ్సజ్, పరిశ్రమల, లేబర్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, తునికలు కొలతలు, డ్రగ్స్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు విధులతో అధికారులు సతమతమవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు జిల్లా అధికారి అందుబాటులో లేరని చెప్పడంతో నిరాశగా తిరిగి వెళ్లిపోతున్నారు. కనీసం కొందరు అధికారులు ఫోన్‌లోనైనా స్పందించడం లేదని వాపోతున్నారు. ఇలా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు పూర్తి కావడం లేదని వారు పేర్కొంటున్నారు. కార్యాలయ సిబ్బంది కూడా సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. అలాగే, దీనికి తోడు తరుచు వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు, వివిధ కార్యక్రమాలతో అధికారులు బిజీబిజీగా మారుతున్నారు.
కొరవడుతున్న పర్యవేక్షణ
ఇన్‌చార్జ్ బాధ్యతలు, అదనపు విధులతో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు సొంత శాఖల పనితీరు పైననే దృష్టి సారించలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం పని ఒత్తిడి కారణంగానే సొంత శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలను పసిగట్టలేక పోయారన్న చర్చ జరుగుతోంది. అదనపు విధులతో సొంత శాఖ పనులపై కొంత నిర్లక్ష్యమే కనిపిస్తోంది. పలు శాఖల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రస్థాయి అఽధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో ఆయా శాఖల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని పసిగట్టలేకపోవడంతోనే పాలన గాడితప్పుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
అదనపు విధులతో అధికారులపై తీవ్ర ఒత్తిడి
ఒక్కొక్కరికి నాలుగైదు శాఖల ఇన్‌చార్జ్ బాధ్యతలు
ప్రత్యేక పాలనలో ప్రజలకు తప్పని ఇబ్బందులు