
సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ
ములుగు: తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ అని, ఐక్యత, సౌభ్రాతృత్వం, ఆడపడుచుల ఆత్మీయత పండుగలో ప్రతిబింబిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎస్‌వీపీ సూర్య చంద్రకళ తెలిపారు. బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ములుగు బాలరక్ష భవన్ ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని పూలతో బతుకమ్మలను అలంకరించి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహభరితంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ. సూర్య చంద్రకళ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగలోని గొప్పతనం, మహిళల భాగస్వామ్యం, సమాజంలో వారి స్థానం గురించి గొప్పగా వివరించారు. మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యోత్స్న, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, కార్యదర్శి రంగోజు భిక్షపతి, న్యాయవాదులు రామ్‌సింగ్, బాలుగు చంద్రయ్య, మేకల మహేందర్ బానోతు స్వామిదాస్, సీడీపీఓ శిరీష, వివిధ శాఖల మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక బతుకమ్మ