
క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి
భూపాలపల్లి అర్బన్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఏరియాలోని కృష్ణకాలనీలో జరుగుతున్న సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతీ సింగరేణి ఉద్యోగి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. సింగరేణి ఉద్యోగులు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారని తెలిపారు. భూపాలపల్లి నుంచి కోల్ ఇండియా స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ కేటగిరిల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ నరేష్‌నాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, అఽధికారులు పాల్గోన్నారు.
దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
జిల్లా కేంద్రంలో నిర్వహించే దసరా ఉత్సవాలకు అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో దసరా ఉత్సవాల ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు